ఐపీఎల్ 2024 సీజన్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. సొంతగడ్డపై వాంఖడే మైదానం వేదికగా సోమవారం రాజస్థాన్ రాయల్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో చిత్తయిన ముంబై ఇండియన్స్.. ఈ మ్యాచ్‌లోనైనా విజయం సాధించి లీగ్‌లో బోణీ చేయాలనే పట్టుదలతో ఉంది.
బౌండరీల మోత మోగిన గత మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో దారుణంగా విఫలమైన ముంబై ఇండియన్స్.. తమ సొంతగడ్డపై విజయమే లక్ష్యంగా సిద్దమవుతోంది. టీమ్ కాంబినేషన్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టిన ఆ జట్టు.. బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేయాలనుకుంటోంది. ఇప్పటికే 14 మంది ఆటగాళ్లకు ఆ జట్టు అవకాశం ఇచ్చింది.

కీలక మార్పు..
ఫిట్‌నెస్ సమస్యలతో గత మ్యాచ్‌కు దూరమైన లూక్ వుడ్.. రాజస్థాన్ రాయల్స్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది. అతను పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తే.. 17 ఏళ్ల యువ పేసర్ క్వెనా మఫకా బెంచ్‌కు పరిమితమవుతాడు. హైదరాబాద్‌లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన క్వెనా మఫకా.. ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. దాంతో అతనిపై వేటు వేసే అవకాశం ఉంది.
బ్యాటింగ్ విభాగంలో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. డేవాల్డ్ బ్రెవిస్, రోమారియో షెఫర్డ్‌ల్లో ఒకరు ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగనున్నారు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఆడనున్నారు. ఈ ఇద్దరూ శుభారంభాలు అందిస్తున్నా.. భారీ స్కోర్లు చేయలేకపోతున్నారు. ఫస్ట్ డౌన్‌లో నమన్ ధిర్ బరిలోకి దిగుతాడు.
హార్దిక్ రాణిస్తే..
సూర్యకుమార్ యాదవ్ వచ్చే వరకు అతని స్థానానికి ఢోకా లేదు. బ్యాటింగ్‌లో పర్వాలేదనిపిస్తున్న నమన్ ధిర్ భారీ స్కోర్లు చేయలేకపోతున్నాడు. గత మ్యాచ్‌లో తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా తడబాటు కొనసాగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో అతను స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది.
టీమ్ డేవిడ్, డెవాల్డ్ బ్రెవిస్ ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో జస్‌ప్రీత్ బుమ్రా, గెరాల్డ్ కోయిట్జీ రాణిస్తుండగా.. స్పిన్నర్ పియూష్ చావ్లా సత్తా చాటాల్సి ఉంది. లూక్ వుడ్ వస్తే పేస్ విభాగం మరింత పటిష్టం కానుంది.
ముంబై ఇండియన్స్ తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, నమన్ ధిర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టీమ్ డేవిడ్, డేవాల్డ్ బ్రెవిస్/రొమారియో షెఫర్డ్, షామ్స్ ములాని, గెరాల్డ్ కోయిట్జీ, పియూష్ చావ్లా, లూక్ వుడ్/క్వెనా మఫక, జస్‌ప్రీత్ బుమ్రా