ఐపీఎల్ 2024 సీజన్‌లో వరుసగా మూడు పరాజయాల తర్వాత విజయాన్ని అందుకున్న ముంబై ఇండియన్స్ మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. సొంతగడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో గురువారం జరగనున్న మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది.
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని అందుకున్న ముంబై ఇండియన్స్.. అదే జోరును కొనసాగించాలనుకుంటోంది. మరోవైపు వరుస పరాజయాలతో చతికిల పడిన ఆర్‌సీబీ..ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి మళ్లీ విజయాల బాట పట్టాలనుకుంటోంది.

ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడిన ఆర్‌సీబీ ఒకే ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఇరు జట్ల ముఖా ముఖి పోరులో ఆర్‌సీబీపై ముంబై ఇండియన్స్‌దే పైచేయిగా ఉంది. ఇప్పటివరకు ఇరు జట్లు 32 సార్లు తలపడగా ముంబై ఇండియన్స్ 18 సార్లు విజయం సాధించింది. బెంగళూరు జట్టు 14 మ్యాచ్‌ల్లో గెలిచింది.
ఇదే ఆధిపత్యాన్ని తాజా సీజన్‌లోనూ కొనసాగించాలని ముంబై భావిస్తోంది. సూర్యకుమార్ యాదవ్ రీఎంట్రీతో ఆ జట్టు బలం పెరిగింది. అయితే గాయం నుంచి కోలుకున్న సూర్యను ముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడిస్తోంది. రీఎంట్రీ మ్యాచ్‌లో సూర్య దారుణంగా విఫలమయ్యాడు. డకౌట్‌గా వెనుదిరిగాడు.
విన్నింగ్ కాంబినేషన్‌ను ముంబై ఇండియన్స్ మార్చకపోవచ్చు. అయితే ఆర్‌సీబీ బ్యాటర్లకు స్పిన్నర్లను ఆడటం బలహీనత కాబట్టి ఆ దిశగా ఆలోచిస్తే జట్టులోకి ఓ స్పెషలిస్ట్ స్పిన్నర్‌ను తీసుకోవచ్చు. ఇప్పటికే పియూష్ చావ్లా, మహమ్మద్ నబీ స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా బరిలోకి దిగుతున్నారు. గత మ్యాచ్‌లో నబీ తేలిపోయాడు. ఈ క్రమంలోనే అతనిపై వేటు వేసి కుమార కార్తీకేయ లేదా షామ్స్ ములానీని ఆడించే అవకాశం ఉంది.
ఈ ఒక్కటి మినహా జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. పేసర్లుగా జస్‌ప్రీత్ బుమ్రా, గెరాల్డ్ కోయిట్జీ, ఆకాశ్ మధ్వాల్ కొనసాగనున్నారు.
ముంబై ఇండియన్స్ తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, టీమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, మహమ్మద్ నబీ, గెరాల్డ్ కోయిట్జీ, పియూష్ చావ్లా, జస్‌ప్రీత్ బుమ్రా
ఇంపాక్ట్ ప్లేయర్: ఆకాశ్ మధ్వాల్