హైదరాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కీలక పోరుకు సిద్దమైంది. బుధవారం చెన్నై వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు టోర్నీలో ముందడుగు వేయనుండగా.. ఓడిన జట్టు ఇంటి బాట పట్టనుంది. దాంతో ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.
ఇక వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ రేసులోకి అనూహ్యంగా దూసుకొచ్చిన ముంబై ఇండియన్స్ అదే జోరును కొనసాగించి టైటిల్ గెలవాలనుకుంటోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన రోహిత్ సేన ఫుల్ జోష్‌లో ఉంది. మరోవైపు సమష్టి ప్రదర్శనతో ఒక్క పరుగుతో కేకేఆర్‌ను ఓడించి ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖాయం చేసుకున్న లక్నో పటిష్టంగా కనిపిస్తోంది.

దాంతో ఈ మ్యాచ్ కూడా అభిమానులకు కావాల్సిన మజాను ఇవ్వనుంది. అయితే ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 3 మ్యాచ్‌లు జరగ్గా మూడింటిలోనూ లక్నోనే గెలిచింది. గత సీజన్‌లో రెండు, ఈ సీజన్‌లో ఓ మ్యాచ్‌లో లక్నో చేతిలో ముంబై ఓడింది. ఈ రికార్డు రోహిత్ ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురి చేస్తోంది.
చెన్నైలోని చెపాక్ మైదానం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుండటంతో స్పిన్నర్లు కీలకం కానున్నారు. ఇరు జట్లలో స్పిన్నర్లు సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఇక ముంబై ఇండియన్స్ ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్‌నే కొనసాగించే అవకాశం ఉంది.
కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నారు. గత మ్యాచ్‌తో రోహిత్ శర్మ కూడా ఫామ్ అందుకోవడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ఈ ఇద్దరు అదిరిపోయే ఆరంభాన్ని అందిస్తే ముంబైకి తిరుగుండదు. మిడిలార్డర్‌లో సూర్యకుమార్ యాదవ్, కామెరూన్ గ్రీన్, నెహాల్ వధేరా ఆడనున్నారు. సూర్య సూపర్ ఫామ్‌లో ఉండగా.. గత మ్యాచ్‌లో గ్రీన్ సెంచరీతో చెలరేగాడు. నెహాల్ వధేరా కూడా సూపర్బ్‌గా బ్యాటింగ్ చేస్తున్నాడు.
గాయంతో జట్టుకు దూరమైన తెలుగు తేజం తిలక్ వర్మ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది. టోర్నీ ఆరంభంలో తిలక్ వర్మ అసాధారణ ఇన్నింగ్స్‌లు ఆడాడు. గాయంతో జట్టుకు దూరం కాగా.. అతని స్థానంలో బరిలోకి దిగిన విష్ణు వినోద్ సత్తా చాటాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఈ ఇద్దరిలో ఒకరు బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. అయితే ముంబై ముందుగా బౌలింగ్ చేస్తేనే వీరు ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగవచ్చు. లేదంటే ఎక్స్‌ట్రా బౌలర్ కోసం ముంబై ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్‌ను వాడుకోవచ్చు.
టీమ్ డేవిడ్, క్రిస్ జోర్డాన్, జాసెన్ బెహ్రాండార్ఫ్, ఆకాశ్ మధ్వాల్ పేస్ బాధ్యతలు పంచుకోనుండగా.. వీరికి కామెరూన్ గ్రీన్ అండగా ఉండనున్నాడు. ఆకాశ్ మధ్వాల్ మినహా మిగతా పేసర్లు దారుణంగా విఫలమవుతుండటం ముంబైని కలవరపెడుతోంది. జోర్డాన్ అయితే ధారళంగా పరుగులిస్తున్నాడు.
స్పిన్నర్లుగా పియూష్ చావ్లా, కుమార్ కార్తీకేయ బరిలోకి దిగనున్నారు. చావ్లా ముంబై కీ బౌలర్‌గా రాణిస్తున్నాడు. చెపాక్ వికెట్‌పై అతనికి మంచి అనుభవం ఉంది. అతను చెలరేగితే ప్రత్యర్థికి ఇబ్బందులు తప్పవు.
లక్నోతో ముంబై ఇండియన్స్ తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టీమ్ డేవిడ్, నెహాల్ వధేరా, క్రిస్ జోర్డాన్, పియూష్ చావ్లా, జాసెన్ బెహ్రాండార్ఫ్, కుమార్ కార్తీకేయ, ఆకాశ్ మధ్వాల్,
ఇంపాక్ట్ ప్లేయర్: విష్ణు వినోద్/ తిలక్ వర్మ