న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్‌లో వరుస ఓటములతో చతికిలపడ్డ మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం అరుణ్ జైట్లీ మైదానం వేదికగా జరగనున్న మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన ముంబైకి ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి.
మరోవైపు హ్యాట్రిక్ పరాజయాలతో పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచిన ఢిల్లీ కూడా విజయం కోసం ఉవ్విళ్లూరుతున్నది. ఎలాగైనా బోణీ కొట్టాలనే పట్టుదలతో ఉంది. బలాలు బలహీనతల పరంగా ముంబై ఇండియన్స్‌దే పైచేయిగా కనిపిస్తున్నా.. ఆ జట్టు ఆటగాళ్లు దారుణంగా విఫలమవుతున్నారు.

జట్టు నిండా ఇంటర్నేషనల్ స్టార్లే ఉన్నా.. ఒక్కరు ఫామ్‌లో లేరు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఓపెనర్ ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, కామెరూన్ గ్రీన్ దారుణంగా విఫలమయ్యారు. టాప్-5 బ్యాటర్లలో తిలక్ వర్మ ఒక్కడే సూపర్ ఫామ్ కనబరుస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగిన అతను రెండో మ్యాచ్‌లో విలువైన పరుగులు చేశాడు.
అతనికి తోడుగా టాప్-4 బ్యాటర్లలో ఒక్కరు నిలిచినా ముంబైకి తిరుగుండదు. అయితే రూ.17.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన కామెరూన్ గ్రీన్.. తొలి రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యారు. అతన్ని పక్కనపెట్టి ట్రిస్టన్ స్టబ్స్‌ను ఆడించే ప్రయత్నం ముంబై టీమ్‌మేనేజ్‌మెంట్ చేయవచ్చు.
అతనికి మరో అవకాశం ఇవ్వాలనుకుంటే మాత్రం జట్టులో కొనసాగుతాడు. ఆల్‌రౌండర్ టీమ్ డేవిడ్ గత మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించినా.. అది జట్టు విజయానికి సరిపోలేదు. అతను భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు.
పేసర్లుగా జాసన్ బెహండార్ఫ్, జోఫ్రా ఆర్చర్, అర్షద్ ఖాన్ బరిలోకి దిగనుండగా.. స్పిన్నర్లుగా హృతిక్ షోకీన్, పియూష్ చావ్లా ఆడనున్నారు. కుమార్ కార్తికేయాను ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దించవచ్చు.
ముంబై ఇండియన్స్ తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, అర్షద్ ఖాన్, టీమ్ డేవిడ్, జోఫ్రా ఆర్చర్, హృతిక్ షోకీన్, పియూష్ చావ్లా, జాసన్ బెహ్రాండార్ఫ్.
ఇంపాక్ట్ ప్లేయర్: కుమార కార్తీకేయ