అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ సునీల్ ఛెత్రీ కలిసారు. భారత పర్యటనలో భాగంగా ఆదివారం మెస్సీ ముంబై వాంఖడే క్రికెట్ స్టేడియంలో సందడి చేశాడు. ఈ సందర్భంగా మెస్సీని సచిన్ టెండూల్కర్ కలిసాడు. ఈ ఇద్దరూ ఒకే వేదికపై కనిపించి క్రీడాభిమానులను కనువిందు చేశారు.
ఈ ఇద్దరి జెర్సీ నంబర్ 10 కావడం విశేషం. ఈ సందర్భంగా మెస్సీకి సచిన్ టెండూల్కర్ అపురూపమైన కానుకను అందించాడు. 2011 వరల్డ్ కప్ ఫైనల్ జెర్సీని మెస్సీకి బహకరించాడు. మెస్సీ కూడా తాను సాకర్ ప్రపంచకప్‌లో గోల్ కొట్టిన ఫుట్‌బాల్‌ను సచిన్‌కు కానుకగా అందించాడు. ఈ ఇద్దరు దిగ్గజాలను చూసి స్టేడియం హోరెత్తింది. భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ సునీల్ ఛెత్రీ కూడా మెస్సీని కలిసాడు. మెస్సీ తన జెర్సీని సునీల్ ఛెత్రీకి కానుకగా అందజేశాడు.
మెస్సీని కలవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని సచిన్ పేర్కొన్నాడు. మరోవైపు రోహిత్ శర్మ నామస్మరణతో వాంఖడే స్టేడియం దద్దరిల్లింది. ముంబైకా రాజా రోహిత్ శర్మ అంటూ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి రోహిత్ శర్మను ఎందుకు ఆహ్వానించలేదంటూ తమ నిరసనను వ్యక్తం చేశారు.

ఈ మైదానంలో ఏర్పాటు చేసిన 7 వర్సెస్ 7 మ్యాచ్‌లో సునీల్ ఛెత్రీ తన బెంగళూరు ఎఫ్‌సీ ఆటగాళ్లతో కలిసి బరిలోకి దిగాడు. జిమ్ సరభ్, భారత మహిళల ఫుట్‌బాల్ కెప్టెన్ బాలా దేవీతో కూడిన సెలెబ్రిటీ టీమ్‌తో సునీల్ ఛెత్రీ టీమ్ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో సునీల్ ఛెత్రీ తొలి గోల్‌ను నమోదు చేశాడు. దురదృష్టవశాత్తు ఆట ప్రారంభంలోనే అతనికి కండరాలు పట్టేయడంతో మైదానంలో ఒక ప్రాంతానికే పరిమితమయ్యాడు.
మెస్సీ ఎంట్రీతో ప్రేక్షకుల ఆనందం రెట్టింపు అయ్యింది. ఇంట మయామి సహచరులైన రోడ్రిగో డి పాల్, లూయిస్ సువారెజ్‌తో కలిసి మెస్సీ వాంఖడే మైదానంలోకి అడుగుపెట్టాడు. ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడుతున్న ప్లేయర్లతో మెస్సీ ముచ్చటించాడు. చివర్లో నిలిచిన భారత మాజీ కెప్టెన్ సునీల్ ఛెత్రీని మెస్సీ ఆలింగనం చేసుకోగానే అభిమానులు పెద్ద ఎత్తున అరిచారు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో రెండో అత్యధిక గోల్ స్కోరర్, నాలుగో అత్యధిక గోల్ స్కోరర్‌ను కలవడంతో భారత ఫుట్‌బాల్ అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు.