న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్ వెటరన్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ విచిత్రకర రీతిలో పెవిలియన్ చేరాడు. బ్యాటింగ్ చేసేటప్పుడు చేతితో బంతిని ఆపి ఔటయ్యాడు. బంగ్లా క్రికెట్ చరిత్రలోనే హ్యాడ్లింగ్ ది బాల్‌గా ఔటైన తొలి బ్యాటర్‌గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఇక భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంక బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్ టైమ్‌డ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
ఇదే బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను ఆలస్యంగా బ్యాటింగ్ చేశాడని అంపైర్లు ఔటిచ్చారు. ఈ రెండు ఘటనలపై స్పందించిన బంగ్లాదేశ్ కెప్టెన్ మెహిదీ హసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టైమ్డ్ ఔట్ తమకు కలిసొచ్చినా.. తాజా ఘటనలో మాత్రం వికెట్ కోల్పోయామని తెలిపాడు.

'ముష్ఫికర్ రహీమ్ కావాలని బంతిని అడ్డుకోలేదు. బ్యాటింగ్ చేసే క్రమంలో అనుకోకుండా చేతితో బంతిని ఆపాడు. ఉద్దేశపూర్వకంగా ఇలా ఔట్ కావాలని ఎవరూ అనుకోరు. మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పలు అంశాలను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా బంతిని ఎదుర్కొన్న తర్వాత అది స్టంప్స్ మీదకు వస్తుందేమోనని భయపడ్డాడు. అలాంటి సమయంలో యాక్సిడెంటల్‌గా చేతితో బంతిని ఆపాడు. ప్రపంచకప్‌లో శ్రీలంక బ్యాటర్ టైమ్‌డ్ ఔట్ విషయంలో మాకు అనుకూలంగా నిర్ణయం వచ్చింది. కానీ, ఈసారి అలా జరగలేదు.'అని మెహ్‌దీ హసన్ వ్యాఖ్యానించాడు.
బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో తొలి రోజే 15 వికెట్లు పడ్డాయి. ఇందులో 13 వికెట్లు స్పిన్నర్లే తీసారు. గింగిరాలు తిరిగిన పిచ్‌పై బ్యాటర్లు నిలబడలేకపోయారు. ఈ పిచ్ గురించిన మాట్లాడిన మెహ్‌దీ హసన్.. ఈ వికెట్‌పై పూర్తి అవగాహన ఉందన్నాడు.
'మేం సరైన ప్రదేశంలో బంతిని విసిరితే న్యూజిలాండ్ బ్యాటర్లు ఇబ్బంది పడుతారని తెలుసు. బ్యాటింగ్ సమయంలో వారి స్పిన్నర్లను ఎదుర్కోవడం చాలా కష్టంగా మారింది. ఇక్కడి పిచ్ పరిస్థితులపై మాకు పూర్తి అవగాహన ఉంది. పిచ్ నుంచి సహకారం లభిస్తుండటంతో త్వరగా వికెట్లు తీసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించాం.'అని మెహ్‌దీ హసన్ తెలిపాడు.
ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకు ఆలౌటైంది. అతనంతరం న్యూజిలాండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 55/5 స్కోర్‌తో నిలిచింది. వర్షం కారణంగా రెండో రోజు ఆట సాధ్యం కాలేదు.