ఎక్కువ డాట్ బాల్స్ ఆడటమే తమ ఓటమిని శాసించిందని యూపీ వారియర్స్ కెప్టెన్ మెగ్ లాన్నింగ్ తెలిపింది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)2026 సీజన్‌లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) 9 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌ను చిత్తు చేసింది. యూపీ వారియర్స్ నిర్దేశించిన 144 పరుగుల లక్ష్యాన్ని ఆర్‌సీబీ 12.1 ఓవర్లలోనే ఛేదించింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన మెగ్ లాన్నింగ్.. ఆర్‌సీబీ అద్భుతమైన ప్రదర్శనతో తమను చిత్తు చేసిందని తెలిపింది. 'ఇది మేం ఆశించిన ఆరంభం కాదు. ఒకటి లేదా రెండు విజయాలతో టోర్నీని ప్రారంభించాలని అనుకున్నాం. ఈ రాత్రి ఆర్‌సీబీ మాపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఈ ఓటమి ద్వారా మేం మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయనే విషయం అర్థమైంది. అయితే మంచి విషయం ఏంటంటే మ్యాచ్‌లు వెనువెంటనే ఉండటంతో ఈ ఓటమి నుంచి త్వరగానే బయటపడుతాం.
బ్యాటింగ్‌లో మేం మూమెంటమ్ అందుకోలేకపోయాం. చాలా ఎక్కువ డాట్ బాల్స్ ఆడాం. నేను కూడా చాలా డాట్ బాల్స్ ఆడాను. ఈ విషయంలో మేం మెరుగుపడాలి. ఆర్‌సీబీ మాత్రం పట్టు సాధించాక వదల్లేదు. ఆఖరి వరకు ఆధిపత్యం చెలాయించింది.

వికెట్ నుంచి సహకారం లభిస్తుందేమోనని శిఖా పాండే క్రాస్ సీమ్ బౌలింగ్‌ను ప్రయత్నించింది. ఈ టోర్నీలో అమె అత్యుత్తమ బౌలర్లలో ఒకరు. చాలా వైవిధ్యంగా బౌలింగ్ చేస్తూ ఉంటుంది. ఈ రాత్రి ఆమె ప్లాన్స్ వర్కౌట్ కాలేదు. కానీ మేం పుంజుకుంటాం. గ్రేస్ హ్యారిస్ క్రీజులో సెట్ అయితే ఆమెను ఆపడం చాలా కష్టం. ఆమె పవర్ హిట్టర్. మంచి క్రికెటింగ్ షాట్స్ ఆడింది. ఆమె దూకుడుకు మేం అడ్డుకట్ట వేయలేకపోయాం.'అని మెగ్ లాన్నింగ్ చెప్పుకొచ్చింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 143 పరుగులు చేసింది. దీప్తి శర్మ(35 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 45 నాటౌట్), డియా డాటిన్(37 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 40) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆర్‌సీబీ బౌలర్లలో శ్రేయాంక పాటిల్(2/50), నదైన్ డి క్లెర్క్(2/28) రెండేసి వికెట్లు తీయగా.. లారెన్ బెల్ ఒక వికెట్ పడగొట్టింది.
అనంతరం ఆర్‌సీబీ 12.1 ఓవర్లలో 145 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఓపెనర్లు గ్రేస్ హ్యారీస్(40 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో 85), స్మృతి మంధాన(32 బంతుల్లో 9 ఫోర్లతో 47 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. యూపీ వారియర్స్ బౌలర్లలో శిఖా పాండే ఒక్కతే వికెట్ తీసింది.