ఆ దేవుడి ప్రణాళికలో భాగంగానే తాము బంగ్లాదేశ్‌తో రెండో టీ20లో మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యం నెలకొల్పామని టీమిండియా యువ ప్లేయర్స్ నితీష్ కుమార్ రెడ్డి, రింకూ సింగ్ తెలిపారు. బుధవారం ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా 86 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఈ గెలుపుతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో యువ ఆల్‌రౌండర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి(34 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 74)తో పాటు రింకూ సింగ్(29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.

దేవుడి ప్లాన్ బ్రో అంటూ..
41 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన భారత జట్టును 108 పరుగుల భారీ భాగస్వామ్యంతో రింకూ సింగ్-నితీష్ రెడ్డి ఆదుకున్నారు. ఈ విజయానంతరం బీసీసీఐ టీవీతో చిట్ చాట్ చేసిన ఈ ఇద్దరూ.. తమ ఇన్నింగ్స్‌లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బ్యాటింగ్ సందర్భంగా 'దేవుడి ప్లాన్ బ్రో'అంటూ.. రింకూ సింగ్ తనను మోటీవేట్ చేశాడని నితీష్ కుమార్ రెడ్డి తెలిపాడు.
అతని మాటలే తనను దూకుడుగా ఆడేలా చేశాయని చెప్పుకొచ్చాడు. 'బ్యాటింగ్ సందర్భంగా మా మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది. 'ఇది దేవుడి ప్లాన్ బ్రో'అని రింకూ సింగ్ నాతో అన్నాడు. దీన్ని మేం నమ్మాం. దూకుడుగా ఆడటం ప్రారంభించాం. స్పిన్నర్లు బంతి అందుకోగానే వారిపై ఎదురు దాడికి దిగాలని నిర్ణయించుకున్నాం. రింకూ సింగ్ సింగిల్ తీసి నాకు స్ట్రైక్ ఇచ్చాడు.
భారీ సిక్సర్లతో తెలుగోడి ఊచకోత..
'ఇది నీ టైమ్ బ్రో'అని రింకూ సింగ్ చెప్పగానే దూకుడుగా ఆడాలని నిర్ణయించుకున్నా.'అని నితీష్ కుమార్ రెడ్డి తెలిపాడు. తొలి 11 బంతులకు 12 పరుగులే చేసిన నితీష్ కుమార్ రెడ్డి.. రింకూ సింగ్ మాటలతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మహ్మదుల్లా బౌలింగ్ వరుసగా రెండు బౌండరీలు బాదిన అతను..రిషద్ హెస్సేన్ బౌలింగ్‌లో వరుసగా మరో రెండు సిక్స్‌లు కొట్టాడు. ఔటయ్యేవరకు అదే జోరు కొనసాగించాడు. ఏడు సిక్స్‌లతో ప్రత్యర్థి బౌలర్లను చెడుగుడు ఆడాడు.
మళ్లీ అదే పరిస్థితి.. మూడో హాఫ్ సెంచరీ..
రింకూ సింగ్ మాట్లాడుతూ..'నేను ఇది ఆ దేవుడి ప్లాన్ అని చెప్పాను. అతనిపై భారం ఉంచి చెలరేగాలని మోటివేట్ చేశాను. అంతే అతను దూకుడుగా ఆడుతూ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. తన రెండో టీ20లోనే అసాధారణ బ్యాటింగ్ చేశాడు. టీ20ల్లో నాకు ఇది మూడో హాఫ్ సెంచరీ. మళ్లీ వికెట్లు త్వరగా కోల్పోయిన తర్వాతే బరిలోకి దిగి హాఫ్ సెంచరీ సాధించాను.
నేను భారత్‌కు ఆడుతున్నప్పటి నుంచి అన్నీ సిరీస్‌లు గెలిచాం. వాటన్నింటిలో నేను భాగమయ్యాను. సుదీర్ఘకాలం పాటు టీమిండియాకు ఆడాలనుకుంటున్నాను. ఇలాగే విజయాలు కొనసాగించాలనుకుంటున్నాం.'అని రింకూ సింగ్ చెప్పుకొచ్చాడు.