
పుణే: చెత్త బ్యాటింగ్ కారణంగానే లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో చిత్తుగా ఓడామని పంజాబ్ కింగ్స్ సారథి మయాంక్ అగర్వాల్ అన్నాడు. లక్నోతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో పంజాబ్ ఓటమిపాలైంది. బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన పంజాబ్ బ్యాటింగ్‌లో ఆ జోరు కొనసాగించలేకపోయింది. దాంతో గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమిపాలై ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన మయాంక్ అగర్వాల్.. వెనువెంటనే వికెట్లు కోల్పోవడం ఓటమికి కారణమైందన్నాడు.
'వరుసగా వికెట్లు కోల్పోయాం. క్రీజులో సెట్ అయిన తర్వాత మా బ్యాటర్లు ఔటయ్యారు. మా బ్యాటింగ్ తీరు తీవ్ర నిరాశకు గురిచేసింది. అత్యంత పేలవ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చాం. స్థాయికి తగ్గట్లు కూడా రాణించలేకపోయాం. కొత్త బంతి స్వింగ్ అవ్వడంతో పాటు అనూహ్యంగా బౌన్స్ అయ్యింది. దాంతో ఆరంభంలో బ్యాటింగ్ చేయడం ఇబ్బందిగా మారింది. కానీ ఆ తర్వాత బ్యాటింగ్‌ను అనుకూలమైన పరిస్థితులు వచ్చాయి. బంతితో అద్భుతంగా రాణించాం. అర్ష్‌దీప్ సింగ్ సత్తా చాటగా.. రాహుల్, కగిసో రబడా వికెట్లు పడగొట్టారు. కానీ పేలవ బ్యాటింగ్‌తో గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయాం.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 153 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్(37 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46), దీపక్ హుడా(28 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 34) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లలో రబడా నాలుగు వికెట్లతో చెలరేగగా రాహుల్ చాహర్ రెండు, సందీప్ శర్మ ఓ వికెట్ తీసాడు.
అనంతరం పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. జానీ బెయిర్ స్టో(28 బంతుల్లో 5 ఫోర్లతో 32) మయాంక్ అగర్వాల్(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 25), రిషి ధావన్(21 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లలో మోహ్‌సిన్ ఖాన్ మూడు వికెట్లు తీయగా.. చమీరా, కృనాల్ పాండ్యా రెండేసి వికెట్లు పడగొట్టారు. రవి బిష్ణోయ్‌కు ఓ వికెట్ దక్కింది.