
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఎలాంటి మార్పులు లేకుండా చెన్నై బరిలోకి దిగుతుండగా.. పంజాబ్ కింగ్స్ మూడు మార్పులు చేసింది. బిగ్ హిట్టర్ షారూఖ్ ఖాన్‌తో పాటు నాథన్ ఎల్లిస్, వైభవ్ అరోరాలపై వేటు వేసి రాజపక్స, సందీప్ శర్మ, రిషీ ధావన్‌లకు అవకాశం కల్పించింది. అయితే టీమ్ ప్రణాళికల్లో భాగంగా ఈ మార్పులు చేసామని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ తెలిపాడు. ఇక నుంచి ఏడు మ్యాచ్‌ల టోర్నీగానే భావించి ఫ్రెష్‌గా స్టార్ట్ చేయాలనుకుంటున్నామని చెప్పాడు.
'వాస్తవానికి నాకు చాయిస్ లేకుండా పోయింది. ఏడు మ్యాచ్‌ల్లో ఆరుసార్లు టాస్ ఓడిపోయాను. ముందుగా బ్యాటింగ్ చేయడంపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. గత మ్యాచ్ పరాజయం గురించి ఆలోచించడం లేదు. ఇక నుంచి ఏడు మ్యాచ్‌ల టోర్నీగా భావించి ముందుకుసాగుతాం. ఫ్రెష్‌గా మొదలుపెడతాం. జట్టులో ఎవరీ బాధ్యతలు వారికి తెలుసు. ప్రణాళికలు అమలుపరచడమే మా ముందున్న కర్తవ్యం. ఈ క్రమంలోనే మూడు మార్పులు చేశాం'అని మయాంక్ అగర్వాల్ తెలిపాడు.
ఇక టాస్ గెలిచిన జడేజా బౌలింగ్ ఎంచుకున్నాడు. డ్యూ వస్తుందో లేదో తమకు తెలియదని, రావాలనే కోరుకుంటున్నానని తెలిపాడు. పెద్దగా ఆలోచించకుండా తమ ప్రణాళికలకు కట్టుబడితే సరిపోతుందని చెప్పాడు. టాస్ ఓడినా గెలిచినా కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలించవన్నాడు. ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. ఇక ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌నే విజయం వరించింది. దాంతో ఈ మ్యాచ్‌లో గెలిచి బదులు తీర్చుకోవాలని సీఎస్‌కే భావిస్తోంది.
తుది జట్లు(అంచనా)
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, మిచెల్ సాంట్నర్, డ్వేన్ ప్రిటోరియస్, డ్వేన్ బ్రావో, ముఖేశ్ చౌదరి, మహీశ్ తీక్షణ
పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్(కెప్టెన్), శిఖర్ ధావన్, జానీ బెయిర్ స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, భానుక రాజపక్స, రిషి ధావన్, కగిసో రబడా, రాహుల్ చాహర్, సందీప్ శర్మ, అర్షదీప్ సింగ్