Mayank Agarwal: సునీల్ గవాస్కర్ వీడియోలను చూసి బ్యాటింగ్ టెక్నిక్ మార్చుకున్నా

ముంబై: దిగ్గజ బ్యాట్స్‌మన్ సునీల్ గవాస్కర్ వీడియోలను చూసి తన బ్యాటింగ్ టెక్నిక్‌ను మార్చుకున్నానని ముంబై టెస్ట్ సెంచరీ హీరో, టీమిండియా ఓపెనర్ మయాంక్(143 బ్యాటింగ్) అగర్వాల్ అన్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో మయాంక్ అగర్వాల్ సెంచరీ బాదిన విషయం తెలిసిందే. 80 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత జట్టును మయాంక్ అద్భుత బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. జట్టులో స్థానం కోల్పోయే పరిస్థితి నెలకొన్న వేళ అద్భుతమైన ఆటతో ఆకట్టుకున్నాడు. విమర్శకులకు తన ఆటతోనే బదులిచ్చాడు. తొలి రోజు ఆట ముగిసిన అనంతరం మాట్లాడిన మయాంక్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

ద్రవిడ్ సర్ మాటలతో..
'తుది జట్టులో చోటు దక్కిన తర్వాత కోచ్ రాహుల్ ద్రవిడ్ నాతో మాట్లాడాడు. నీ చేతుల్లో ఉన్న దాన్ని నియంత్రించుకోవాలి. మైదానంలో అడుగుపెట్టి ఉత్తమ ప్రదర్శన చేయాలి. ఒక్కసారి కుదురుకుంటే భారీ స్కోరు సాధించాలి.' అని ద్రవిడ్ చెప్పాడు. ఈ ఇన్నింగ్స్‌లో శుభారంభాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు సంతోషంగా ఉన్నా. నా ఇన్నింగ్స్ ఆరంభంలో బ్యాట్‌ను కాస్త కిందకు పెట్టి ఆడమని గవాస్కర్ సలహానిచ్చాడు. నాకు బ్యాట్‌ను పైకి ఎత్తి పట్టుకోవడం అలవాటు.

గవాస్కర్ వీడియోలు చూసి..
కానీ గవాస్కర్ బ్యాటింగ్ వీడియోలు చూసి దాన్ని మార్చుకున్నా. తొలి రోజు ఆటలో నాలుగు వికెట్లు తీసిన ఆజాజ్ పటేల్‌పై ఎదురు దాడి చేయాలనుకున్నా. అనుకూలమైన బంతి పడగానే భారీ షాట్లు ఆడాను. శనివారం ఆటలో తొలి సెషన్ కీలకం. వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయడంపైనే మా దృష్టి. మ్యాచ్ సాగుతున్నా కొద్దీ బ్యాటింగ్‌కు ఈ పిచ్ కఠినంగా మారుతుంది'అని మయాంక్ చెప్పుకొచ్చాడు.

సూపర్ మయాంక్..
కెప్టెన్ కోహ్లి డకౌట్, పట్టుదలకు మారుపేరైన పుజారా డకౌట్, గత మ్యాచ్ హీరో శ్రేయస్ విఫలం... అయినా సరే న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో తొలి రోజును భారత్ మెరుగైన స్థితిలో ముగించగలిగింది. అందుకు కారణం మయాంక్ అగర్వాల్! ప్రతికూల పరిస్థితుల్లో పట్టుదలగా క్రీజ్‌లో నిలబడిన అతను ఆకట్టుకునే షాట్లతో అజేయ శతకం సాధించాడు. మొత్తం స్కోరులో సగంకంటే ఎక్కువ పరుగులు సాధించి జట్టును ఆదుకున్నాడు. దాంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 70 ఓవర్లలో 4 వికెట్లకు 221 పరుగులు చేసింది.

ట్రబుల్‌లో డబుల్ దిశగా..
221/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. కివీస్ స్పిన్నర్ ఆజాజ్ పటేల్.. ఓకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి కోలుకోలేని దెబ్బతీసాడు. ఆజాజ్ స్పిన్ ధాటికి వృద్దిమాన్ సాహా తన ఓవర్ నైట్ స్కోర్‌కు 2 పరుగులు మాత్రమే జత చేసి పెవిలియన్ చేరాడు. రెండో రోజు రెండో ఓవర్‌లోనే సాహాను వికెట్ల ముందు బోల్తా కొట్టించిన ఆజాజ్.. ఆ మరుసటి బంతికే క్రీజులోకి వచ్చిన అశ్విన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
ఈబంతిని అంచనా వేయడంలో విఫలమైన అశ్విన్.. గోల్డెన్ డక్‌గా తెల్ల మొహం వేస్తూ పెవిలియన్ బాట పట్టాడు. క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్‌తో కలిసి సెంచరీ హీరో మయాంక్ అగర్వాల్ ఆచితూచి ఆడుతున్నాడు. ప్రతికూల పరిస్థితుల్లో మయాంక్ ఓపికగా బ్యాటింగ్ చేస్తూ డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications