Mathew Wade Injured In IND vs AUS 2nd T20: ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ మాథ్యూ వేడ్ తీవ్రంగా గాయపడ్డాడు. టీమిండియాతో ఆదివారం జరిగిన రెండో టీ20లో భారత్ పేసర్ విసిరిన బంతి మాథ్యూ వేడ్‌కు తాకరాని చోట తాకింది. అదే చోట మరోసారి తాకడంతో మాథ్యూ వేడ్ నొప్పితో విలవిలలాడాడు. ఈ గాయంతో మ్యాచ్ అనంతరం పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో కూడా పాల్గొనలేదు.
ప్రసిధ్ కృష్ణ వేసిన 18వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని మాథ్యూ వేడ్ పుల్ షాట్‌కు ప్రయత్నించగా.. మిస్సైన బంతి అతని జననాంగంపై బలంగా తాకింది. ఈ ఊహించని ఘటనతో మాథ్యూ వేడ్ కుప్పకూలాడు. నొప్పితో విలవిలలాడాడు. ఫిజియో వచ్చి ప్రథమ చిక్సిత చేసినా.. 2 నిమిషాల పాటు అలానే ఉండిపోయాడు.

అనంతరం కాస్త కోలుకున్న మాథ్యూ వేడ్ నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్ కొనసాగించాడు. నొప్పితో వచ్చిన కోపాన్ని బంతిపై చూపించి సిక్సర్ బాదాడు.ముఖేష్ కుమార్ వేసిన ఆఖరి ఓవర్‌లోనూ మాథ్యూ వేడ్‌కు మళ్లీ అక్కడే బంతి బలంగా తాకింది. దాంతో అతను మరోసారి నొప్పితో విలవిలలాడాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితమయ్యాడు.
మాథ్యూ వేడ్ స్థానంలో ఆస్ట్రేలియా హెడ్ కోచ్ ఆండ్రీ బోరోవెక్ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ప్రణాళికలను సరిగ్గా అమలు చేయకపోవడంతోనే ఓటమిపాలయ్యామని తెలిపాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 235 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(25 బంతుల్లో 30 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53), రుతురాజ్ గైక్వాడ్(43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58), ఫస్ట్ డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్(32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీలతో రాణించారు.
చివర్లో రింకూ సింగ్(9 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31 నాటౌట్) తనదైన శైలిలో మెరుపులు మెరిపించాడు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ మూడు వికెట్లు తీయగా.. మార్కస్ స్టోయినీస్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 191 పరుగులే చేసి ఓటమిపాలైంది. కెప్టెన్ మాథ్యూ వేడ్(23 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 42 నాటౌట్), మార్కస్ స్టోయినీస్(25 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 45) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ మూడేసి వికెట్లు తీయగా.. అర్ష్‌దీస్ సింగ్, అక్షర్ పటేల్, ముకేష్ కుమార్ తలో వికెట్ తీసారు.