ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే)ను వెటరన్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ నడిపించబోతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ మేరకు రాజస్థాన్ రాయల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ ట్రేడ్ డీల్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందే ట్రేడింగ్ డీల్ ద్వారా రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజూ శాంసన్‌ను సీఎస్‌కే తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
సంజూ శాంసన్‌ను ఇవ్వాలంటే ఇద్దరు ఆటగాళ్లను ఇవ్వాలని రాజస్థాన్ రాయల్స్ చేసిన ప్రతిపాదనకు సీఎస్‌కే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ఓ జాతీయ ఛానెల్ పేర్కొంది. సంజూ శాంసన్ కోసం స్టాల్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు సామ్ కరణ్‌ను వదులుకునేందుకు సీఎస్‌కే సిద్దమైనట్లు సమాచారం. ఈ ఇద్దరిని తీసుకునేందుకు రాజస్థాన్ రాయల్స్ అంగీకరిస్తే.. ఆటగాళ్ల మార్పిడి ప్రక్రియ పూర్తవుతుంది.

సంజూ శాంసన్ తన ఐపీఎల్ కెరీర్‌లో ఎక్కువ కాలం రాజస్థాన్ రాయల్స్‌కే ఆడాడు. ఐపీఎల్ 2021 సీజన్ నుంచి కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. మరోవైపు జడేజా తన కెరీర్‌ను రాజస్థాన్ రాయల్స్‌తో ప్రారంభించాడు. ఆ తర్వాత చెన్నైకే ఎక్కువ ప్రాతినిధ్యం వహించాడు. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరణ్ సీఎస్‌కేతో పాటు పంజాబ్ కింగ్స్‌కు ఆడాడు.
సంజూ శాంసన్, రవీంద్ర జడేజా ఐపీఎల్ వేతనం రూ. 18 కోట్లు. కాబట్టి ఇది స్వాప్ డీల్. కానీ సామ్ కరణ్ ధర రూ. 2.40 కోట్లు. ఈ డబ్బును రాజస్థాన్ రాయల్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ట్రేడింగ్ డీల్ విషయమై త్వరలోనే అధికార ప్రకటన రానుందని ఇరు జట్ల వర్గాలు పేర్కొన్నాయి. సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకొని సారథ్య బాధ్యతలు అప్పగించాలనే యోచనలో సీఎస్‌కే ఉంది.
మహేంద్ర సింగ్ ధోనీ కెరీర్ చివరి దశలో ఉండటం..కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ ఆశించిన ఫలితాలు అందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 మినీ వేలంలో డిసెంబర్ చివరి వారంలో జరిగే అవకాశం ఉంది. నవంబర్ 15లోపు ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్, రిలీజ్ ఆటగాళ్ల జాబితాలను ప్రకటించాల్సి ఉంటుంది.