పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)లో భారీగా ఆర్థిక అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆ దేశ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ జాహిద్ గిష్కోరి వెల్లడించారు. ప్రస్తుత పీసీబీ ఛైర్మన్ మోహ్‌సిన్ నఖ్వీ పదవి కాలంలోనే ఈ అవకతవకలు జరిగాయని సదరు జర్నలిస్ట్ ఆరోపించారు. పీసీబీ తమకు ఇష్టమైన రెండు సంస్థలకు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులను కట్టబెట్టినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా అతను ఓ వీడియోను విడుదల చేశారు.
'పారదర్శకమైన వేలం నిర్వహించకుండానే, బోర్డులోని కొందరు ఉన్నతాధికారులు తమకు అత్యంత సన్నిహితమైన రెండు ప్రైవేట్ కంపెనీలకు బిలియన్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను కట్టబెట్టారు. స్టేడియాల ఆధునీకరణ పేరుతో కోట్ల రూపాయాలు కొల్లగొట్టారు. ముఖ్యంగా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం చేపట్టిన స్టేడియాల పునరుద్దరణ కోసం అంచనా వ్యయం కంటే అదనంగా ఖర్చు చేశారు. ఎలాంటి టెండర్లు పిలవకుండానే తెలిసిన కాంట్రాక్టర్లకు నిర్మాణ పనులు అప్పగించారు.
పీసీబీకి సొంత లీగల్ టీమ్ ఉన్నప్పటికీ.. బయటి లా సంస్థలకు, కన్సల్టెంట్లకు కోట్లాది రూపాయాలను ఫీజుల రూపంలో చెల్లించారు. ఇలా బోర్డుకు చెందిన కోట్ల రూపాయాలను పక్కదారి పట్టించారు. పీసీబీలోని అంతర్గత ఆడిట్ విభాగాన్ని కూడా తప్పుదోవ పట్టించేలా రికార్డులను సృష్టించారు. సుమారు రూ.600 కోట్ల రూపాయాల వ్యవయానికి సంబంధించిన రశీదులు, కావాల్సిన పత్రాలు లేవు. పీఎస్‌ఎల్ బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్ విషయంలోనూ భారీ అవకతవకులు జరిగాయి.'అని జాహిద్ గిష్కోరి ఆధారాలతో సహా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

సొంత క్రికెట్ బోర్డులోనే భారీ అక్రమాలకు పాల్పడిన మోహ్‌సిన్ నఖ్వీపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బోర్డులో భారీగా అవినీతికి పాల్పడుతూనే మళ్లీ బంగ్లాదేశ్ గురించి మాట్లాడుతూ సుద్దపూస సూక్తులు చెబుతున్నాడని నెటిజన్లు మండిపడుతున్నారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ పాల్గొనే విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అతను చెప్పిన నేపథ్యంలో.. జాహిద్ గిష్కోరి బోర్డు అక్రమాలు బయటపెట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది.
తమ దేశప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్‌తో సమావేశమయ్యానని, ప్రస్తుత పరిస్థితుల గురించి వివరించానని, తుది నిర్ణయం జనవరి 30 లేదా ఫిబ్రవరి 2న వెల్లడిస్తామని మోహ్‌సిన్ నఖ్వీ ట్వీట్ చేశాడు.
ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ ఈఎస్‌పీఎన్.. భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలనే యోచనలో పాకిస్థాన్ ఉన్నట్లు తెలిపింది. ఈ టోర్నీలో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. టోర్నీలో పాల్గొని భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలని, తద్వారా ఆతిథ్య దేశానికి తమ నిరసనను తెలియజేయాలని పీసీబీ భావిస్తుందని పేర్కొంది.