
రాంచీ: న్యూజిలాండ్ స్టార్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో తొలి ఓవర్‌లో మూడు బౌండరీలు బాదిన గప్టిల్.. టీ20 ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించాడు.
95 మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ 3,227 పరుగులు చేయగా.. 111 మ్యాచ్‌ల్లో మార్టిన్ గప్టిల్ 3237 రన్స్ చేశాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ(3086), ఆరోన్ ఫించ్(2608), పాల్ స్టిర్లింగ్(2570) వరుసగా ఉన్నారు. ఈ మ్యాచ్‌కు ముందు ఈ ఘనతను అందుకోవడానికి 10 పరుగుల దూరంలో ఉన్న గప్టిల్.. భువనేశ్వర్ కుమార్ వేసిన తొలి ఓవర్‌లో మూడు బౌండరీలు బాది ఈ ఘనతను అందుకున్నాడు. అయితే 8 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతను ఇచ్చిన క్యాచ్‌ను లాంగాన్‌లో కేఎల్ రాహుల్ నేలపాలు చేశాడు.
ఈ అవకాశంతో మరింత ధాటిగా ఆడిన గప్టిల్.. రెండు భారీ సిక్స్‌లు బాదాడు. అయితే రోహిత్ శర్మ మార్క్ కెప్టెన్సీతో దీపక్ చాహర్ వేసిన ఐదో ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దీపక్ చాహర్ వేసిన బౌన్సర్‌ను తప్పుగా అంచనా వేసిన గప్టిల్.. వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు చిక్కి ఔటయ్యాడు. క్రీజులోకి ఛాప్‌మన్ రాగా.. మిచెల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. పవర్ ప్లే ముగిసే సరికి న్యూజిలాండ్ వికెట్ నష్టానికి 64 పరుగులు చేసింది.
అంతకుముందు టాస్ గెలిచిన రోహిత్ తేమ ప్రభావంతో ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రాంచీలో చేజింగ్‌కు అనుకూలిస్తుందని, తమ ఆటగాళ్లకు కూడా మ్యాచ్‌ను ముగించడం ఎలానో తెలుస్తుందనే ఈ నిర్ణయం తీసకున్నానని హిట్ మ్యాన్ తెలిపాడు. యువ ఆటగాళ్లతో కూడిన తమ జట్టు ఉత్సాహంగా బరిలోకి దిగుతుందని చెప్పాడు. ఎప్పుడెప్పుడు తమ సత్తాను నిరూపించుకుందామా? అని యువ ఆటగాళ్లంతా సిద్దంగా ఉన్నారని తెలిపాడు. అయితే తుది జట్టులో ఓ మార్పు జరిగిందని, గత మ్యాచ్‌లో గాయపడ్డ మహమ్మద్ సిరాజ్ స్థానంలో హర్షల్ పటేల్ తుది జట్టులోకి వచ్చాడని చెప్పాడు.
ఐపీఎల్‌లో హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచి భారత జట్టులో చోటు దక్కించుకున్న పర్పుల్ పటేల్ అలియాస్ హర్షల్ పటేల్.. అజిత్ అగార్కర్ చేతుల మీదుగా అరంగేట్ర క్యాప్ అందుకున్నాడు. పూర్తిస్థాయిలో టీ20 సారథ్య బాథ్యతలు అందుకున్న రోహిత్ శర్మ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో టాస్ గెలవడం గమనార్హం. దాంతో నెటిజన్లు.. రోహిత్ లక్ అంటే నీదనయ్యా అంటూ కామెంట్ చేస్తున్నారు.