
సిడ్నీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ ప్రశంసల జల్లు కురిపించాడు. విరాట్ ప్రపంచంలోనే శక్తివంతమైన క్రికెటర్ అని కొనియాడాడు. ఐపీఎల్ 2020 సీజన్ ముగిసిన వెంటనే కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టింది. నవంబర్ 27 నుంచి ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు, మూడు టీ20లు నాలుగు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. కరోనా అనంతరం జరుగుతున్న తొలి అంతర్జాతీయ టూర్ కావడంతో భారత్ ఈ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
అయితే గత పర్యటనల్లో కోహ్లీ తన దూకుడుతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే విరాట్ ఎలా రాణిస్తాడనేదానిపైనే ఆసక్తి నెలకొంది. అయితే
కోహ్లీ దూకుడు స్వభావం గల క్రికెటర్‌గానే కాకుండా ఆదర్శవంతమైన ఆటగాడిగా నిలుస్తాడని మార్క్ టేలర్ తెలిపాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విరాట్ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తాడని మెచ్చుకున్నాడు. కోహ్లీ ఆటను చూస్తుంటే సహజసిద్ధంగా ఉంటుందని.. ఎప్పుడూ ఆటను గౌరవిస్తాడని చెప్పుకొచ్చాడు.
'ప్రపంచ క్రికెట్‌లో విరాట్ అత్యంత శక్తివంతమైన ఆటగాడు. కోహ్లీ దూకుడు స్వభావం కలిగిన ఆటగాడైనప్పటికీ అతని కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తిస్తాడు. తనదైన ఆటతో ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తాడు. అతని ఆట చాలా సహజసిద్దంగా ఉంటుంది. ఆటను ఎప్పుడూ గౌరవిస్తాడు. అతనితో మాట్లాడినప్పుడు నాకు ఈ విషయం అర్థమైంది'అని మార్క్ టేలర్ చెప్పుకొచ్చాడు.
ఆసీస్‌లో గురువారమే అడుగుపెట్టిన భారత ఆటగాళ్లంతా సిడ్నీలో క్వారంటైన్‌లో ఉన్నారు. అక్కడే ప్రాక్టీస్ చేస్తూ సుదీర్ఘ పర్యటనకు సమాయత్తమవుతున్నారు. ఇక గత సీజన్‌లో ఇక్కడ పర్యటించిన భారత్.. ఆస్ట్రేలియా గడ్డపై 2-1తో తొలిసారి టెస్టు సిరీస్ గెలుపొందింది. ఈ సిరీస్ విరాట్ ఒక సెంచరీతో 282 రన్స్ చేశాడు. కోహ్లీ ఫస్ట్ సెంచరీని కూడా ఆస్ట్రేలియాపైనే అడిలైడ్ వేదికగా సాధించాడు.
2011-12 టూర్‌లో భారత్ వైట్ వాష్ అయినా.. విరాట్ తన పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. తన దూకుడుతో వివాదాల్లో కూడా చిక్కుకున్నాడు. 2014లో అయితే నాలుగు సెంచరీలతో 692 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఇందులో అడిలైడ్ వేదికగా ఒకే మ్యాచ్‌లో రెండు సెంచరీలు చేశాడు. అయితే ఈ సారి విరాట్ ఒకే టెస్ట్ ఆడనున్నాడు. తన భార్య అనుష్కశర్మ డెలివరీ ఉండటంతో పెటర్నీటీ లీవ్ తీసుకున్న విరాట్.. భారత్‌కు వెళ్లనున్నాడు.