IPL 2022: కోహ్లీ పరిస్థితే రోహిత్ శర్మకు.. వరుస విజయాలతో టీమిండియా కెప్టెన్సీ రేసులోకి వచ్చిన స్టార్ ఆల్‌రౌండ

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పరిస్థితే ప్రస్తుత సారథి రోహిత్ శర్మకు వచ్చింది. ఐపీఎల్ విజయాలను ప్రస్తావిస్తూ రోహిత్ శర్మకు సారథ్య బాధ్యతలు అప్పగించాలని అప్పట్లో చేసిన డిమాండ్లు మళ్లీ పునరావృతమవుతున్నాయి. టీమిండియా సారథిగా రోహిత్ శర్మ తన సత్తా చూపించకముందే భవిష్యత్తు కెప్టెన్‌పై చర్చలు మొదలయ్యాయి. ఇన్నాళ్లు రోహిత్ శర్మ తర్వాత రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ కెప్టెన్సీ పగ్గాలందుకుంటారని చర్చ జరగ్గా.. ఇప్పుడు ఆ జాబితాలోకి మరోకొత్త పేరు వచ్చి చేరింది. ఐపీఎల్ 2022 సీజన్‌లో నయా టీమ్ గుజరాత్ టైటాన్స్‌ను నడిపిస్తూ.. వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా భవిష్యత్తు భారత కెప్టెన్ అవుతాడనే వాదన తెరపైకి వచ్చింది.
ప్రస్తుత సీజన్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో దుమ్మురేపుతున్న హార్దిక్.. టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం ఖాయం కాగా.. అతను భవిష్యత్తు సారథి అవుతాడని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్ క్రీడా మంత్రి, వెటరన్ క్రికెటర్ మనోజ్ తివారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ తర్వాత భారత జట్టు(పరిమిత ఓవర్లు) పగ్గాలు చేపట్టే అర్హత హార్ధిక్ పాండ్యాకు మాత్రమే ఉందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్‌కు కానీ, భవిష్యత్తు టీమిండియా కెప్టెన్‌గా ఫోకస్ అవుతున్న రిషబ్ పంత్‌కు కాని సారథ్య బాధ్యతలు దక్కే అవకాశం లేదని, ప్రస్తుత ఐపీఎల్‌లో కెప్టెన్‌గానే కాకుండా ఆటగాడి గానూ అద్భుతంగా రాణిస్తున్న హార్ధిక్ పాండ్యాకే మెరుగైన అవకాశాలు ఉన్నాయని చెప్పాడు.
రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో హార్ధిక్ ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్ (87, వికెట్)తో చెలరేగడాన్ని ఇందుకు ఉదహరిస్తూ ప్రశంసల జల్లు కురిపించాడు. 'భవిష్యత్తులో హార్ధిక్ పాండ్యా బ్యాట్‌తోనే కాకుండా బంతితోనూ సంచలన ప్రదర్శనలు నమోదు చేస్తాడు. గుజరాత్ కెప్టెన్‌గా అతని వ్యూహాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ లక్షణాలే అతన్ని రోహిత్ శర్మ తర్వాత టీమిండియా కెప్టెన్‌ను చేస్తాయి. మొత్తంగా ఐపీఎల్‌లో హార్ధిక్ ప్రదర్శనకు ఫిదా అవుతున్నాను'అని మనోజ్ తివారి ట్వీట్ చేశాడు.
ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications