టీమిండియాపై పూర్తి ఆధిపత్యం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌దే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతను హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జట్టులో చోటు చేసుకుంటున్న మార్పులే ఇందుకు నిదర్శనం. జట్టు ఎంపిక నుంచి మైదానంలో అనుసరించాల్సిన వ్యూహాల వరకు అన్నీ గంభీరే నిర్ణయాలు తీసుకుంటున్నాడు. గంభీర్ ఆధిపత్యం తట్టుకోలేక సీనియర్ ఆటగాళ్లు ఒక్కొక్కరిగా జట్టుకు దూరమవుతున్నారనే వాదన కూడా ఉంది.
తాజాగా ఈ వాదనకు బలం చేకూర్చేలా మాజీ క్రికెటర్ మనోజ్ తీవారి కీలక వ్యాఖ్యలు చేశాడు. గంభీర్‌కు నచ్చిన ఆటగాడే కెప్టెన్‌గా ఉంటాడని స్పష్టం చేశాడు. టీ20 జట్టులోకి శుభ్‌మన్ గిల్ రీఎంట్రీ ఇవ్వడం, వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పడం గంభీర్ నిర్ణయమేనన్నాడు. శుభ్‌మన్ గిల్ కోసం అద్భుతంగా ఆడుతున్న సంజూ-అభిషేక్ శర్మ జోడీని విడదీసాడని అభిప్రాయపడ్డాడు.

'శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఆటగాడే. ఇప్పటికే తన సత్తా ఏంటో చూపించాడు. ఐపీఎల్‌లో కూడా అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. కెప్టెన్‌గా కూడా తన సామర్థ్యాన్ని చాటుకున్నాడు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా మరింత బాధ్యత తీసుకున్నాడు. కానీ శుభ్‌మన్ గిల్ కంటే ముందు జింబాబ్వే పర్యటనలో అభిషేక్ శర్మ-సంజూ శాంసన్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. బంగ్లాదేశ్‌పై అద్భుతమైన ఆరంభాలు అందించారు. ఓ క్రికెట్ అభిమానిగా ఊహకు కూడా అందని బ్యాటింగ్ అప్రోచ్‌తో చెలరేగారు.
వారి కారణంగా టీ20ల్లో గతంలో ఎన్నడూ లేని బ్యాటింగ్ అప్రోచ్‌ను చూశాం. ఈ ఇద్దరూ ఆటగాళ్లు విధ్వంసకర బ్యాటింగ్‌తో అదిరిపోయే ఆరంభాలు అందించారు. ఇద్దరూ అసాధారణ ప్రదర్శనతో సెంచరీలు బాదారు. అలాంటి జోడీని విడదీసి శుభ్‌మన్ గిల్‌ను తీసుకురావాల్సిన అవసరం ఏం ఉంది? ఇందుకు కారణం ఏంటో అందరికి తెలిసిందే. ఇది ఓపెన్ సీక్రెట్. తన మాటను వినే కెప్టెన్లను మాత్రమే జట్టులో ఉండాలని గంభీర్ కోరుకుంటాడు.'అని మనోజ్ తివారి చెప్పుకొచ్చాడు.
ఏడాది తర్వాత టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన శుభ్‌మన్ గిల్.. యూఏఈతో తొలి మ్యాచ్‌లో తన శైలికి భిన్నంగా బ్యాటింగ్ చేశాడు. అభిషేక్ శర్మతో కలిసి దూకుడుగా ఆడి భారత విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో కూడా గిల్ అదే అప్రోచ్‌ను కొనసాగించాడు. కానీ త్వరగానే ఔటయ్యాడు. మరోవైపు సంజూ శాంసన్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన అభిషేక్ శర్మ రెండు ఇన్నింగ్స్‌ల్లో విధ్వంసకర బ్యాటింగ్‌తో దుమ్మురేపాడు. సిక్సర్ల మోత మోగించాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సూపర్ 4 బెర్త్‌ను దక్కించుకుంది. ఒమన్‌తో శుక్రవారం ఆఖరి మ్యాచ్ ఆడనుంది.