మందు తాగలేదు.. పాక్Xఆస్ట్రేలియా మ్యాచ్ చూసాడు: షేన్ వార్న్ మేనేజర్

కోహ్ సమూయి (థాయ్‌లాండ్): స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ హఠాన్మరణంతో క్రికెట్ ప్రపంచం షాక్‌కు గురైంది. థాయ్‌లాండ్ విహారంలో ఉన్న షేన్ వార్న్ శుక్రవారం తన విల్లా గదిలో విగత జీవిగా మారిన విషయం తెలిసిందే. అతని మృతికి ముందు చివరి క్షణాల్లో ఏం జరిగిందో వార్న్ మేనేజర్ జేమ్స్ ఎర్స్‌కిన్ బయటపెట్టాడు. మరణించడానికి ముందు షేన్ వార్న్.. పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టును టీవీలో చూసాడని, మద్యం కూడా తీసుకోలేదని తెలిపాడు. హాలిడే కోసం థాయ్‌లాండ్ వెళ్లిన వార్న్.. బరువు తగ్గేందుకు డైటింగ్ చేస్తున్నాడని తెలిపాడు.

ఆస్ట్రేలియా X పాక్ మ్యాచ్ చూశాడు..
'మ్యాచ్‌ల కామెంట్రీ కోసం ఇంగ్లండ్ వెళ్లే ముందు దొరికిన సమయాన్ని గడిపేందుకు వార్న్ థాయ్‌లాండ్‌కు వచ్చాడు. మరణానికి ముందు అతను మద్యం తీసుకోలేదు. తన స్నేహితుడు నియోఫిటోను కలిసి భోజనం చేయాలనుకున్నాడు. సాయంత్రం 5 గంటల సమయంలో మరికొంత మందిని వార్న్, నియోఫిటో కలవాలనుకున్నారు. పక్క గదిలోనే ఉన్న నియో వచ్చేసరికి వార్న్ నిర్జీవంగా పడి ఉన్నాడు. అతనికి ఏదో అయిందని నియో భావించాడు. నోటిలో నోరు పెట్టి శ్వాస ఇచ్చేందుకు ప్రయత్నించాడు.

బరువు తగ్గేందుకు డైట్..
హృదయ స్పందన లేకపోవడంతో సీపీఆర్ చేశాడు. 20 నిమిషాల తర్వాత అంబులెన్స్ వచ్చింది. ఓ గంట తర్వాత వార్న్ చనిపోయాడనే విషయం తెలిసింది. అతన్ని రెండు గంటల ముందు చివరగా చూశా. అతనెక్కువగా మద్యం తాగడం లేదు. బరువు తగ్గేందుకు ఆహార నియమాలు పాటిస్తున్నాడు'' అని సుదీర్ఘ కాలంగా వార్న్ మేనేజర్‌గా ఉన్న జేమ్స్ చెప్పాడు. మరోవైపు ఆసుపత్రికి తీసుకు వచ్చేలోపే వార్న్ ప్రాణాలు పోయాయని థాయ్ అంతర్జాతీయ ఆసుపత్రి వెల్లడించింది.

అధికారిక లాంఛనాలతో..
షేన్ వార్న్‌కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ శనివారం ప్రకటించారు. ''వార్న్ హఠాన్మరణంతో ఆస్ట్రేలియా ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. అధికారిక లాంఛనాలతో వార్న్ అంత్యక్రియలు చేస్తాం. మా దేశపు అత్యుత్తమ వ్యక్తుల్లో వార్న్ ఒకడు. క్రికెట్ ఆడేలా ఎంతోమంది అబ్బాయిలు, అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచాడు'' అని మోరిసన్ తెలిపారు. విక్టోరియా ప్రభుత్వం ఈ బాధ్యతలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. అంత్యక్రియలు ఎప్పుడూ ఎక్కడ జరుగుతాయో వెల్లడించలేదు.

బీర్లు, సిగరేట్లతో నివాళులు..
మరోవైపు వార్న్ గౌరవార్థం ఎంసీజీ మైదానంలోని ది గ్రేట్ సదర్న్ స్టాండ్‌కు అతని పేరు పెట్టనున్నట్లు విక్టోరియా క్రీడల మంత్రి మార్టిన్ ప్రకటించారు. వార్న్ ఆ మైదానంలో తన 700వ టెస్టు వికెట్‌తో పాటు ఓ యాషెస్ మ్యాచ్‌లో హ్యాట్రిక్ తీసుకున్నాడు. ఇప్పటికే ఆ మైదానం బయట అతని విగ్రహం ఉంది. అతని మరణవార్త తెలిసిన తర్వాత ప్రజలు అక్కడికి చేరుకుని వార్న్‌కు ఇష్టమైన సిగరేట్లు, బీర్లు, బేక్డ్ బీన్స్, పూలు, క్రికెట్ బంతులు విగ్రహం దగ్గర ఉంచి నివాళులు అర్పించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications