
నాగ్‌పూర్: భారత అనామక క్రికెటర్ మహేశ్ పితియా.. గత వారం రోజులుగా క్రికెట్ సర్కిల్‌లో బాగా వినిపిస్తున్న పేరు. కేవలం రంజీ ట్రోఫీ మాత్రమే ఆడిన ఈ బరోడా క్రికెటర్ గురించి మాజీ క్రికెటర్లు కూడా మాట్లాడుతున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ పుణ్యమా.. ఈ యువ స్పిన్నర్ దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నాడు. భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ శైలి కలిగి ఉండే మహేశ్ పితియాను ఆస్ట్రేలియా తమ నెట్ బౌలర్‌గా నియమించుకుంది. ముఖ్యంగా స్టీవ్ స్మిత్.. మహేశ్ పితియా బౌలింగ్‌ను నెట్స్‌లో ప్రత్యేకంగా ఎదుర్కొన్నాడు. అశ్విన్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు ఆసీస్.. ఈ బౌలర్‌తో ప్రాక్టీస్ చేసింది. బెంగళూరులో ప్రాక్టీస్ క్యాంప్ ముగిసినా.. అతన్ని జట్టుతో అంటిపెట్టుకొని నెట్ బౌలర్‌గా సేవలందించుకుంటుంది.
ఇక ఆస్ట్రేలియా జట్టుతో నాగ్‌పూర్ చేరిన మహేశ్ పితియా.. తన ఆరాధ్య దైవం అశ్విన్, విరాట్ కోహ్లీలను కలిసాడు. అశ్విన్‌తో జరిగిన సంభాషణను మీడియాతో పంచుకున్నాడు. 'ఈ రోజు నా ఆరాధ్య దైవం ఆశీర్వాదాలు అందుకున్నాను. నేనెప్పుడు అతనిలా బౌలింగ్ చేయాలనుకుంటాను. నెట్స్‌లోకి అతను రాగానే కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాను. అతను మాత్రం నన్ను హత్తుకున్నాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లకు ఏ బంతులు బౌలింగ్ చేశావని అడిగాడు. కోహ్లీ సైతం నన్ను చూసి నవ్వుతూ గుడ్ లక్ చెప్పాడు.
ఆసీస్‌తో ప్రాక్టీస్ క్యాంప్‌లో తొలి రోజు స్టీవ్ స్మిత్‌ను కనీసం ఆరు సార్లు ఔట్ చేసి ఉంటా. రంజీ ట్రోఫీతోనే నా కెరీర్ ప్రారంభించాను. ప్రస్తుతం నా ఫోకస్ అంతా రెడ్ బాల్ క్రికెట్‌పైనే ఉంది. బరోడా జట్టులో నా స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలి. ఐపీఎల్ గురించి ఏ మాత్రం ఆలోచించడం లేదు. నేను క్యారమ్ బాల్, దూస్రా ఏం వేయను. నా స్టాక్ బాల్ ఆఫ్ బ్రేక్, మరొకటి నేను సొంతంగా డెవలప్ చేసుకుంది. బ్యాక్ స్పిన్. దీన్నినేను వైట్ బాల్ క్రికెట్‌లో ఉపయోగిస్తాను. ఆస్ట్రేలియాతో నెట్ బౌలర్‌గా పనిచేయడం అద్భుతంగా ఉంది. స్టీవ్ స్మిత్‌కు బౌలింగ్ చేయడమే నా పని. ప్రత్యేకంగా బంతులేయమని స్మిత్ నన్ను అడగలేదు. ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ నాథన్ లయన్ నాకు విలువైన సలహాలు ఇచ్చాడు.