టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాపై దిగ్గజ క్రికెటర్ మదన్ లాల్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతనో అసాధారణమైన బౌలర్ అని కొనియాడాడు. బుమ్రా తన బౌలింగ్‌తో ఆసీస్ ఆటగాళ్ల జీవితాన్ని నరకంగా మారుస్తున్నాడని తెలిపాడు. ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా శుభారంభం చేసిన విషయం తెలిసిందే.
పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియాను నడిపించిన బుమ్రా.. అటు బౌలింగ్‌తోనూ.. ఇటు కెప్టెన్సీతోనూ ఆకట్టుకున్నాడు. దాంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా 295 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 8 వికెట్లతో బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

బుమ్రా వరల్డ్ క్లాస్ బౌలర్..
తాజాగా Mykhel వెబ్‌సైట్‌కు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో బుమ్రాపై మదన్‌లాల్ ప్రశంసల జల్లు కురిపించాడు. బుమ్రాలాంటి పేసర్లను తయారు చేసిన ఘనత ధోనీ, విరాట్ కోహ్లీలదని చెప్పాడు. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టీమిండియా క్లీన్ స్వీప్ అవ్వడానికి బీసీసీఐ తీసుకున్న చెత్త నిర్ణయమే కారణమని అభిప్రాయపడ్డాడు.
'బుమ్రా బౌలింగ్ యాక్షన్ చూడటానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. కానీ బుమ్రా వేసే బంతిని ఎంత తోపు బ్యాటర్ అయినా అంచనా వేయలేడు. కొద్ది దూరం మాత్రమే పరుగెత్తే బుమ్రా.. విలక్షణమైన బౌలింగ్‌తో బ్యాటర్లను బెంబేలెత్తిస్తాడు. అతని అసాధారణ బౌలింగ్‌తో బ్యాటర్ల జీవితాలను నరకంగా మారుస్తాడు. బుమ్రా వరల్డ్ క్లాస్ బౌలర్. ఇప్పుడు అతను ఇంతలా రాణిస్తున్నాడంటే.. దాని వెనుక ఎంతో కష్టం ఉంది. ఆ హార్డ్ వర్క్ వల్లనే బుమ్రా వరల్డ్ క్లాస్ బౌలర్ అయ్యాడు.
ఆసీస్ బ్యాటర్లకు చుక్కలే..
బుమ్రా అద్భుతమైన బౌలర్. అతను బౌన్సర్ వేయగలడు. ఇన్ స్వింగ్‌తో పాటు ఔట్ స్వింగ్ చేయగలడు. అలాగే కచ్చితమైన యార్క్‌ర్‌ను సంధించగలడు. ఈ సిరీస్‌లో బుమ్రా క్లాస్ బౌలింగ్‌తో ఆసీస్ బ్యాటర్ల జీవితం నరకప్రాయంగా మారనుంది. టెస్ట్‌ల్లో 7వేల పరుగులు చేసిన బ్యాటర్లు కూడా బుమ్రా బౌలింగ్‌లో ఇబ్బంది పడుతారు. బుమ్రా బౌలింగ్ ఆడటం అంత సులువు కాదు. అతను ఎంత తోపు బ్యాటర్‌ను అయినా ఇబ్బంది పెడుతాడు.
మా కాలంలో ఫాస్ట్ బౌలర్లు 7-8 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసేవారు. ఆ తర్వాత స్పిన్నర్లతో బౌలింగ్ కొనసాగించేవారు. అయితే ఈ విధానాన్ని భారత మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ పూర్తిగా మార్చేశారు. భారత జట్టులో ఫాస్ట్ బౌలర్ల సంఖ్యను పెంచిన ఘనత ఈ ఇద్దరిదే. వీరికే మనం థ్యాంక్స్ చెప్పాలి. ప్రస్తుతం భారత్ సాధిస్తున్న ఫలితాల క్రెడిట్ ఈ ఇద్దరిదే.
బీసీసీఐ చెత్త నిర్ణయం..
న్యూజిలాండ్ చేతిలో క్లీన్ స్వీప్ అవ్వడానికి బీసీసీఐ చెత్త నిర్ణయమే కారణం. జట్టులో ప్రతిభావంతమైన పేసర్లు ఉండగా.. స్పిన్ ట్రాక్‌లు సిద్దం చేయడం బుద్దిలేని పని. మంచి స్పోర్టింగ్ వికెట్స్ తయారు చేసి ఉంటే టీమిండియా విజేతగా నిలిచేది.'అని మదన్ లాల్ చెప్పుకొచ్చాడు.