లక్నో: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ), లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ- గౌతమ్ గంభీర్ గొడవపడటం తీవ్ర చర్చనీయాంశమైంది. మ్యాచ్ అనంతరం ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు మైదానంలో మాటల యుద్దానికి దిగారు. ఒకరిపైకి మరొకరు దూసుకెళ్లారు. దాంతో ఈ గొడవపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ జరుగుతోంది.
లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతమ్ గంభీర్‌దే తప్పని అంతా విమర్శలు గుప్పించారు. ఇరు జట్ల మధ్య గొడవకు ఆజ్యం పోసింది గంభీరేనని, తొలి మ్యాచ్ సందర్భంగా ఆర్‌సీబీ అభిమానులను ఉద్దేశించి చేసిన సైగలే కోహ్లీని రెచ్చగొట్టాయని కామెంట్ చేశారు.
ఇతరులను కామెంట్ చేసేటప్పుడు వారి నుంచి వచ్చే ప్రతి స్పందనకు కూడా సిద్దంగా ఉండాలని, గంభీర్ అలా లేడని విమర్శలు గుప్పించారు.

అయితే ఆర్‌సీబీ అభిమానులను గంభీర్ కించపర్చడం నిజమే అయినా.. కోహ్లీతో కావాలనే కయ్యానికి దిగడం కూడా వాస్తవమే అయినా... గంభీర్ కంటే విరాట్ కోహ్లీ ఘోర తప్పిదం చేశాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. గంభీర్ గప్‌చుప్ సైగలకు కోహ్లీ మైదానంలోనే బదులిచ్చాడు. ఆర్‌సీబీ అభిమానులు ఎవరూ సైలెంట్‌గా ఉండవద్దని, వారికి తాను అండగా ఉంటానని పదే పదే అభిమానులకు చెప్పే ప్రయత్నం చేశాడు.
గంభీర్ సైగలకు ప్రతిచర్యగానే మైదానంలో కోహ్లీ దూకుడుగా వ్యవహరించాడు. కానీ నవీన్ ఉల్ హక్ పట్ల కోహ్లీ ప్రవర్తించిన తీరును సొంత అభిమానులే తప్పుబడుతున్నారు. ఎంత చెడ్డ వ్యక్తికైనా చెప్పు చూపించడం ఘోర తప్పిదం. కానీ ఈ మ్యాచ్‌లో భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేకపోయిన కోహ్లీ.. నవీన్ ఉల్ హక్‌ను దారుణంగా తిట్టాడు. 'నువ్వు నా బూటుకు అంటిన మట్టితో సమానం'అని తన బూటును చూపిస్తూ తిట్టాడు.
ఇదే గంభీర్‌కు ఆగ్రహం తెప్పించింది. మ్యాచ్ ముగిసిన అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకునే సమయంలో నవీన్ ఉల్ హక్‌కు కోహ్లీ ఏదో చెప్పబోయాడు. దానికి తీవ్ర ఆగ్రహానికి గురైన నవీన్ ఉల్ హక్.. కోహ్లీ చేతిలో నుంచి తాన చేతిని బలంగా లాగేసుకున్నాడు. దాంతో అక్కడ చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకోగా.. సహచర ఆటగాళ్లు ఇద్దర్నీ దూరంగా తీసుకెళ్లారు.
ఆ వెంటనే కైల్ మేయర్స్.. కోహ్లీ దగ్గరకు వచ్చి ఏదో మాట్లాడుతుండగా.. గంభీర్ అతన్ని పక్కకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో కోహ్లీని గంభీర్ ఏదో కామెంట్ చేశాడు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కోహ్లీ.. గంభీర్‌తో మాట్లాడేందుకు సిద్దమయ్యాడు. కానీ మాట మాట పెరిగి గొడవకు దారి తీసింది.
లక్నో సూపర్ జెయింట్స్, గౌతమ్ గంభీర్ ఆర్‌సీబీని రెచ్చగొట్టడం వాస్తవమే అయినా... నవీన్ ఉల్ హక్‌కు కోహ్లీ బూటు చూపించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోహ్లీకి అండగా నిలిచిన వ్యక్తులు కూడా ఈ విషయం తెలిసి అతని తీరును విమర్శిస్తున్నారు.