
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. లీగ్‌లో కొనసాగుతున్న చేజింగ్ ట్రెండ్‌నే తాను ఫాలో అవుతున్నానని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపాడు. అన్ని జట్లూ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంటున్నాయని చెప్పిన రాహుల్.. ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. విన్నింగ్ కాంబినేషన్‌నే కొనసాగిస్తున్నామని తెలిపాడు. రెండు గోల్డెన్ డక్స్ తర్వాత సెంచరీ సాధించడం సంతోషంగా ఉందని, ఈ మ్యాచ్‌లో ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నానని చెప్పాడు.
ఈ సీజన్‌లో తమకు మంచి ఆరంభం లభించిందన్న ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్.. తమ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారని కొనియాడాడు. అత్యంత బలమైన జట్టుతో పోటీపడుతున్నామని, టాస్ గెలిస్తే ఫీల్డింగే ఎంచుకునేవాళ్లమని చెప్పాడు. ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్‌నే కొనసాగిస్తున్నామని తెలిపాడు.
ఇరు జట్లు చెరో 6మ్యాచ్‌లు ఆడగా.. చెరో 4మ్యాచ్‌లు గెలిచి 8పాయింట్లతో సరిసమానంగా ఉన్నాయి. కాకపోతే నెట్ రన్‌రేట్ విషయంలో ఆర్సీబీ (+0.142)తో పోల్చితే ఎల్ఎస్‌జీ(+0.296) కాస్త మెరుగ్గా ఉండడంతో పాయింట్ల పట్టికలో ఎల్ఎస్‌జీ మూడో స్థానంలో కొనసాగుతుండగా.. ఆర్సీబీ నాలుగో స్థానంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి టాప్ ప్లేస్‌ను కైవసం చేసుకోవాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.
తుది జట్లు:
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డికాక్, మనీష్ పాండే, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, ఆయుష్ బదోని, జాసన్ హోల్డర్, కృనాల్ పాండ్యా, దుష్మంత చమీర, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్
ఆర్‌సీబీ: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్, సుయాశ్ ప్రభుదేశాయ్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హాజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్