LSG vs RCB: ఫాఫ్ డుప్లెసిస్ సెంచరీ మిస్.. లక్నో ముందు టఫ్ టార్గెట్!

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(64 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 96) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. అయితే అతని విధ్వంసకర ఇన్నింగ్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ ముందు ఆర్‌సీబీ 182 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. డుప్లెసిస్‌కు తోడుగా షెబాజ్ అహ్మద్(26) రాణించడంతో ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 181 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో దుష్మంత్ చమీరా, జాసన్ హోల్డర్ రెండేసి వికెట్లు తీయగా.. కృనాల్ పాండ్యా ఓ వికెట్ పడగొట్టాడు.

కోహ్లీ గోల్డెన్ డక్..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)కి ఫస్ట్ ఓవర్‌లోనే గట్టి షాక్ తగిలింది. దుష్మంత్ చమీరా వేసిన తొలి ఓవర్‌లో అనూజ్ రావత్(4), విరాట్ కోహ్లీ వరుస బంతుల్లో పెవిలియన్ చేరారు. దాంతో 7 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఆర్‌సీబీని క్రీజులోకి వచ్చిన గ్లేన్ మ్యాక్స్‌వెల్‌తో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ గాడిన పెట్టే ప్రయత్నం చేసాడు. చమీరా వేసిన మూడో ఓవర్‌లో మ్యాక్స్ వెల్ రెండు బౌండరీలు ఓ సిక్స్ బాదగా.. డుప్లెసిస్ ఓ ఫోర్ కొట్టాడు. దాంతో ఆ ఓవర్‌లో 19 పరుగులొచ్చాయి. జోరు మీదున్న మ్యాక్స్‌వెల్‌ను కృనాల్ పెవిలియన్ చేర్చడంతో పవర్ ప్లేలో ఆర్‌సీబీ 3 వికెట్ల నష్టానికి 47 రన్స్ చేసింది.

అండగా నిలిచిన షెహ్‌బాజ్
అనంతరం సుయశ్ ప్రభుదేశాయ్ రాగా.. ఫాఫ్ నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అయితే ప్రభుదేశాయ్(10)ను హోల్డర్ ఔట్ చేయగా.. షెహ్‌బాజ్ అహ్మద్(26)కెప్టెన్‌కు అండగా నిలిచాడు. ఈ క్రమంలో రవిబిష్ణోయ్ బౌలింగ్‌లో క్విక్ సింగిల్ తీసిన ఫాఫ్.. 40 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజులో కుదురుకున్న ఈ జోడీని రాహుల్ సూపర్ ఫీల్డింగ్‌తో విడదీసాడు. షెహ్‌బాజ్ అహ్మద్‌ను సూపర్ త్రోతో రనౌట్ చేశాడు. దాంతో ఐదో వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

చెలరేగిన డుప్లెసిస్..
క్రీజులోకి దినేశ్ కార్తీక్ రాగా.. స్ట్రైకింగ్ ఎక్కువ తీసుకున్న ఫాఫ్ డుప్లెసిస్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. దాంతో ఆర్‌సీబీ స్కోర్ బోర్డు పరుగెత్తింది. చివరి ఓవర్‌లో భారీ షాట్‌కు యత్నించి క్యాచ్ ఔటైన డుప్లెసిస్ 4 పరుగుల వ్యవధిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. హోల్డర్ సూపర్ బౌలింగ్‌తో ఆఖరి ఓవర్‌లో 4 పరుగులు మాత్రమే ఇచ్చి ఆర్‌సీబీ భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications