లక్నో: ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్ మరో కీలక పోరుకు సిద్దమైంది. మంగళవారం లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే లీగ్ మ్యాచ్‌లో రోహిత్ సేన అమీతుమీ తేల్చుకోనుంది. పాయింట్స్ టేబుల్‌లో టాప్-3, 4 స్థానాల్లో ఉన్న ఇరు జట్లు ప్లే ఆఫ్స్ చేరాలంటే ఈ మ్యాచ్ గెలవడం కీలకం.
ఈ మ్యాచ్‌లో ఓడినా.. రెండు జట్లకు మరో మ్యాచ్ రూపంలో అవకాశం ఉన్నా.. ఇతర మ్యాచ్‌ల ఫలితాలతో పాటు రన్‌రేట్‌పై ప్లే ఆఫ్స్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఈ తలనొప్పి లేకుండా హాయిగా ప్లే ఆఫ్స్ చేరాలంటే నేటి మ్యాచ్ గెలవడం ఇరు జట్లకు ముఖ్యం.

అయితే ఐపీఎల్ 2023 టోర్నీలోనే అత్యంత స్లో వికెట్ అయిన లక్నో పిచ్‌పై ఇరు జట్లు ఎలా ఆడుతాయనేది కీలకంగా మారింది. వాంఖడే వంటి హై స్కోరింగ్ మైదానాల్లో చెలరేగిన ముంబై.. స్పిన్‌కు అనుకూలంగా ఉండే లక్నో వికెట్‌పై ఎలా ఆడుతుందో చూడాలి. మరోవైపు సొంతమైదానంలో ఎక్కువ ఓటములు చవిచూసిన లక్నో.. ముంబైతో ఎలా ఆడుతుందో అనేది ఆసక్తికరంగా మారింది.
ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన మ్యాచ్‌లన్నీ లోస్కోరింగ్ థ్రిల్లర్సే. నేటి మ్యాచ్ కూడా ఉత్కంఠతో అభిమానులను అలరించే అవకాశం ఉంది. లక్నో వికెట్‌పై లక్నో సూపర్ జెయింట్స్ ఓవర్‌సీస్ ఆటగాళ్లు తడబడుతుండటం ఆ జట్టు ప్రధాన సమస్య కాగా.. ముంబై ఇండియన్స్‌లో స్పిన్నర్లు పియూష్ చావ్లా, కుమార్ కార్తీకేయ, హృతిక్ షోకీన్ సూపర్ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం.
ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 2 మ్యాచ్‌లు జరగ్గా.. రెండింటిలోనూ లక్నో సూపర్ జెయింట్సే గెలిచింది. ఈ మ్యాచ్‌కు ఇరు జట్లలో పెద్దగా మార్పులు చోటు చేసుకునే అవకాశం లేదు. లక్నో తమ ఇంపాక్ట్ ప్లేయర్‌గా అమిత్ మిశ్రాను బరిలోకి దించనుండగా.. ముంబై హృతిక్ షోకీన్‌ను ఆడించనుంది. ముంబై తుది జట్టులోకి తెలుగు ప్లేయర్ తిలక్ వర్మను తీసుకుంటుందా? లేక విష్ణు వినోద్‌ను ఆడిస్తుందో చూడాలి. గత మ్యాచ్‌లో విష్ణు వినోద్ అద్భుతంగా రాణించాడు.
తుది జట్లు(అంచనా)
క్వింటన్ డికాక్, కైల్ మేయర్స్, కృనాల్ పాండ్యా, మార్కస్ స్టోయినీస్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, దీపక్ హుడా, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, మోహ్‌సిన్ ఖాన్, గౌతమ్, అమిత్ మిశ్రా
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ/విష్ణు వినోద్, కామెరూన్ గ్రీన్, నెహాల్ వధేర, టీమ్ డేవిడ్, క్రిస్ జోర్డాన్, పియూష్ చావ్లా, జాసన్ బెహ్రెండార్ఫ్, కుమార్ కార్తీకేయ, హృతిక్ షోకీన్.