
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ వేదిక వాంఖడే తమ అడ్డా అని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. తమకు అచ్చొచ్చిన, బాగా తెలిసిన మైదానంలో టాస్ గెలవడం సంతోషంగా ఉందన్నాడు. తమ ప్రేక్షకుల మద్దతుతో ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. 'హోమ్ గ్రౌండ్‌లో ఆడుతుండటం సంతోషంగా ఉంది. చాలా ఏళ్లుగా ఇక్కడ ఆడాం. ప్రేక్షకుల మద్దతు కూడా ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నా. ఇక్కడ మా విన్నింగ్ రికార్డు కూడా బాగానే ఉంది. అయితే మా సొంతమైదానంలో మేం మెరుగ్గా ఆడాల్సి ఉంది.
ఎన్నో ఏళ్లుగా ఈ మైదానంలో ఆడుతున్నాం కాబట్టి ఈ వికెట్ గురించి బాగా తెలుసు. ఇది పూర్తిగా చేజింగ్ గ్రౌండ్. అందుకే ఫీల్డింగ్ తీసుకున్నా. డీసెంట్ బౌండరీలున్నాయి. మా సామర్థ్యాన్ని మేం నమ్ముకొని ఆడాల్సి ఉంది. ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతున్నాం'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
గత మ్యాచ్‌ల్లో చేసిన తప్పిదాలను సరిచేసుకొని బరిలోకి దిగుతున్నామని లక్నో సారథి కేఎల్ రాహుల్ తెలిపాడు. 'వాంఖడేలో జరిగిన గత కొన్ని మ్యాచ్‌ల్లో మంచు ప్రభావం అంతగా కనిపించలేదు. మంచు లేకుంటే టాస్‌కు పెద్దగా ప్రాధాన్యత లేదు. మా ప్రణాళికలను స్మార్ట్‌గా అమలు చేస్తే సరిపోతుంది. మేం ఓడిన మ్యాచ్‌లు భారీ తేడాతో కోల్పోలేదు. స్వల్ప తేడాతోనే చేజార్చుకున్నాం. ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడం మా విజయవకాశాలను దెబ్బతీసింది. కాబట్టి ఈ మ్యాచ్‌లో 50 పరుగుల భాగస్వామ్యాన్ని అందిస్తే సరిపోతుంది.'అని రాహుల్ పేర్కొన్నాడు. జట్టులో ఒక్క మార్పు చోటు చేసుకుందని, గాయం కారణంగా ఆవేశ్ ఖాన్ దూరమయ్యాడని చెప్పాడు.
తుది జట్లు:
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, హృతిక్ షోకీన్, జయదేవ్ ఉనద్కత్, డేనియల్ సామ్స్, రిలే మెరెడిత్, జస్‌ప్రీత్ బుమ్రా
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), మనీష్ పాండే, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, ఆయుష్ బదోని, మార్కస్ స్టొయినిస్, జేసన్ హోల్డర్, మోహ్సిన్ ఖాన్, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్