
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో కేఎల్ రాహుల్(62 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 103 నాటౌట్) మరో సెంచరీతో చెలరేగడంతో ముంబై ఇండియన్స్ ముందు లక్నో సూపర్ జెయింట్స్ 168 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రాహుల్ మినహా ఇతర బ్యాటర్లు రాణించకపోవడంతో లక్నో 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు మాత్రమే చేసింది. రాహుల్ ఒక్కడే 103 పరుగులు చేయగా.. మిగతా ఐదు బ్యాటర్లు 57 రన్స్ మాత్రమే చేశారు. 8 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలోనే వచ్చాయి. ముంబై బౌలర్లలో రిలే మెరిడిత్, కీరన్ పొలార్డ్ రెండు వికెట్లు తీయగా.. డానియల్ సామ్స్, బుమ్రా తలో వికెట్ పడగొట్టారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్‌కు మరోసారి శుభారంభం దక్కలేదు. ఓపెనర్ క్వింటన్ డికాక్(10) బుమ్రా బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అనంతరం మనీశ్ పాండే క్రీజులోకి రాగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ ఇద్దరు నిదానంగా ఆడటంతో లక్నో పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 32 పరుగులే చేసింది. అనంతరం రాహుల్, మనీశ్ పాండే చూడ చక్కని షాట్లతో వేగంగా ఆడే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో రాహుల్ 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజులో కుదురుకున్నఈ జోడీని కీరన్ పొలార్డ్ విడదీసాడు. స్మార్ట్ బౌన్సర్‌తో మనీశ్ పాండే(22)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 58 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. డానియల్ సామ్స్ వేసిన 13వ ఓవర్‌లో రాహుల్ రెండు భారీ సిక్స్‌లు బాదగా.. మార్కస్ స్టోయినిస్ డకౌట్‌గా వెనుదిరిగాడు.
ఆవెంటనే కృనాల్ పాండ్యా కూడా ఔటవ్వడంతో లక్నో నాలుగు వికెట్లు కోల్పోయింది. ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన దీపక్ హుడా(10) కూడా విఫలమయ్యాడు. ఈ పరిస్థితుల్లోఆయూష్ బదోనితో కలిసి రాహుల్ ఒంటరిపోరాటం చేశాడు. ఉనాద్కత్ వేసిన 18వ ఓవర్ హ్యాట్రిక్ బౌండరీలు బాదిన రాహుల్.. మెరిడిత్ వేసిన చివరి ఓవర్ తొలిబంతిని సిక్స్‌గా మలిచి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్‌లో రాహుల్‌కు ఇది రెండో సెంచరీ కాగా.. ఈ రెండు కూడా ముంబైపైనే సాధించడం విశేషం. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో నాలుగో శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. చివరి ఓవర్‌లో 13 పరుగులు మాత్రమే రావడంతో లక్నో 168 పరుగులకే పరిమితమైంది.