లక్నో: ఐపీఎల్ 2023 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో కీలక మ్యాచ్‌కు సిద్దమైన ముంబై ఇండియన్స్‌కు గట్టి షాక్ తగిలింది. ముంబై ఇండియన్స్ యువ పేసర్ అర్జున్ టెండూల్కర్‌ను కుక్క కరిచింది. బౌలింగ్ వేసే చేతి వేళ్లనే కొరకడంతో అతను నేడు(మంగళవారం) జరిగే కీలక మ్యాచ్‌కు దూరమయ్యాడు. కుక్క కరిచిన విషయాన్ని అర్జున్ టెండూల్కరే తెలిపాడు.
లక్నో సూపర్ జెయింట్స్ యువ ఆటగాళ్లు యుధ్‌వీర్ సింగ్, మోహ్‌సిన్ ఖాన్‌లతో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పాడు. ఈ వీడియోను లక్నో సూపర్ జెయింట్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడంతో వైరల్ అయ్యింది. లక్నో యువ ఆటగాళ్లను కలిసి హగ్ ఇచ్చిన అర్జున్ టెండూల్కర్ ఎలా ఉన్నారని ప్రశ్నించాడు. దానికి వారు బాగున్నామని, నీవు ఎలా ఉన్నావని అడిగారు. దానికి అర్జున్ 'కుక్క కరిచింది'అని బదులిచ్చాడు. దానికి లక్నో ప్లేయర్ కుక్కనా? ఎప్పుడూ? అని అడగ్గా.. నిన్ననే అంటూ అర్జున్ సమాధానం చెప్పాడు.

అర్జున్ బౌలింగ్ హ్యాండ్ ఫింగర్స్‌ను కుక్క కొరికినట్లు తెలుస్తోంది. అయితే అర్జున్‌ను కరిచింది పెంపుడు కుక్కనా? వీధి కుక్కనా? అనే విషయంపై క్లారిటీ లేదు. లక్నో వికెట్ స్లోగా ఉండనున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్‌ను బరిలోకి దింపాలని ముంబై భావించింది. స్లో వికెట్‌పై అర్జున్‌కు మంచి రికార్డు ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన అర్జున్ మూడు వికెట్లు తీసాడు.
బ్యాటింగ్‌లో అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్న ముంబై.. బౌలింగ్‌లో మాత్రం తడబడుతోంది. స్పిన్నర్ పియూష్ చావ్లా మినహా మరే బౌలర్ అంతగా రాణించలేకపోతున్నారు. జాసన్ బెహ్రెండార్ఫ్ వికెట్లు తీస్తున్నా ధారళంగా పరుగులు ఇస్తున్నాడు. జోఫ్రా ఆర్చర్ స్థానంలో క్రిస్ జోర్డాన్‌ను తీసుకొచ్చినా ఫలితం లేదు. కామెరూన్ గ్రీన్ కూడా బౌలింగ్‌లో రాణించింది ఏం లేదు. ఈ క్రమంలోనే స్లో వికెట్‌పై అర్జున్ టెండూల్కర్‌ను ఆడించాలని రోహిత్ సేన భావించింది. కానీ అతను కుక్క కాటుతో దూరమయ్యాడు.
ఇక 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, 14 పాయింట్లతో టాప్-3లో ఉన్న ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌కు అడుగు దూరంలో ఉంది. లక్నోతో నేడు జరిగే మ్యాచ్‌లో విజయం సాధిస్తే దాదాపు ముంబై ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు అవుతోంది. హైదరాబాద్‌తో జరిగే చివరి మ్యాచ్‌లో కూడా విజయం సాధిస్తే టాప్-2లో నిలిచి క్వాలిఫయర్‌కు క్వాలిఫై అవుతుంది. రెండు మ్యాచ్‌ల్లో ఓడితే మాత్రం ఇంటిదారి పడుతోంది.