ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 236 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. సునీల్ నరైన్(39 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 81) విధ్వంసకర బ్యాటింగ్‌తో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 235 పరుగులు చేసింది, ఫిల్ సాల్ట్(14 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 32), రఘు వంశీ(26 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 32) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్(3/49) మూడు వికెట్లు తీయగా.. రవి బిష్ణోయ్, యుధ్వీర్ సింగ్, యశ్ ఠాకూర్ తలో వికెట్ తీసారు.

నరైన్ విధ్వంసం..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఓపెనర్లు ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ముఖ్యంగా సునీల్ నరైన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫిల్ సాల్ట్ సైతం మెరుపు మెరిపించడంతో 4 ఓవర్లలోనే కేకేఆర్ 61 పరుగులు చేసింది. దూకుడుగా ఆడుతున్న ఈ జోడీని నవీన్ ఉల్ హక్ విడదీసాడు. ఫిల్ సాల్ట్‌ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు.
క్రీజులోకి వచ్చిన రఘు వంశీతో కలిసి నరైన్ చెలరేగాడు. దాంతో కేకేఆర్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది. అనంతరం ఇదే దూకుడు కొనసాగించిన సునీల్ నరైన్ 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 81 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని రవి బిష్ణోయ్ విడదీసాడు. సెంచరీ దిశగా సాగుతున్న సునీల్ నరైన్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.
రమణ్‌దీప్ సింగ్ మెరుపులు..
అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన రస్సెల్ ఓ బౌండరీ, సిక్సర్ బాది నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే యుధ్‌వీర్ సింగ్ బౌలింగ్‌లో హాఫ్ సెంచరీకి చేరువైన రఘువంశీ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేరాడు. రింకూ సింగ్(16), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. జట్టు స్కోర్‌ను 200 ధాటించారు. అయితే రింకూ సింగ్‌ను నవీన్ ఉల్ హక్ క్యాచ్ ఔట్‌గా బోల్తా కొట్టించాడు. ధాటిగా ఆడే క్రమంలో అయ్యర్(23) కూడా వెనుదిరిగాడు. రమణ్‌దీప్ సింగ్(25 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో కేకేఆర్ 235 పరుగుల భారీ స్కోర్ చేసింది.