
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్.. విజయంతో తమ ప్రయాణాన్ని ప్రారంభించింది. మరో నయా టీమ్ లక్నో సూపర్ జెయింట్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన గుజరాత్ టైటాన్స్..5 వికెట్ల తేడాతో గెలుపొందింది. లీగ్‌లో వరుసగా నాలుగో మ్యాచ్‌లో కూడా టాస్ గెలిచిన జట్టునే విజయం వరించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసింది. అరంగేట్ర ప్లేయర్ ఆయూష్ బాదోని(41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54), దీపక్ హుడా(41 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 55) హాఫ్ సెంచరీలతో రాణించగా... కృనాల్ పాండ్యా(13 బంతుల్లో 3 ఫోర్లతో 21 నాటౌట్) విలువైన పరుగులు చేశాడు. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ మూడు వికెట్లు తీయగా..ఆరోన్ ఫించ్ రెండు, రషీద్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన గుజరాత్ టైటాన్స్ 19.4 ఓవర్లలోనే 5 వికెట్లకు 161 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. రాహుల్ తేవాటియా(24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 నాటౌట్) కడవరకు క్రీజులో నిల్చొని విజయంలో కీలక పాత్ర పోషించాడు. మాథ్యూవేడ్(29 బంతుల్లో 4 ఫోర్లతో 30), హార్దిక్ పాండ్యా(28 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 33), డేవిడ్ మిల్లర్(21 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 30) కీలక ఇన్నింగ్స్ ఆడారు. లక్నో బౌలర్లలో చమీరా రెండు వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్, కృనాల్ పాండ్యా, దీపక్ హుడా తలో వికెట్ పడగొట్టారు.
159 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. దుష్మంత్ చమీరా తన వరుస ఓవర్లలో రెండు వికెట్లు తీసాడు. తొలి ఓవర్‌లో ఓపెనర్ శుభ్‌మన్ గిల్(0) డకౌట్‌గా పెవిలియన్ చేర్చి చమీరా.. మరుసటి ఓవర్‌లో సూపర్ యార్కర్‌తో విజయ్ శంకర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో గుజరాత్ 15 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. మరో ఓపెనర్ మాథ్యూ వేడ్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. బౌండరీలతో ఎదురుదాడికి దిగిన ఈ జోడీ స్కోర్ బోర్డును పరుగెత్తించింది.
ఓ భారీ సిక్సర్‌తో మంచి టచ్‌లో కనిపించిన హార్దిక్ పాండ్యా.. తన అన్న కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 57 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే దీపక్ హుడా బౌలింగ్‌లో మాథ్యూ వేడ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ పరిస్థితుల్లో డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా బాధ్యతగా ఆడారు. ఇద్దరూ భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా దీపక్ హుడా బౌలింగ్‌ను చీల్చిచెండాడారు. చివర్లో డేవిడ్ మిల్లర్ ఔటైనా... క్రీజులోకి వచ్చిన అభినవ్ మనోహర్ మూడు విలువైన బౌండరీలతో విజయానికి బాటలు వేయగా.. రాహుల్ తేవాటియా బౌండరీతో విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.