ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 164 పరుగుల పోరాడే లక్ష్యాన్ని నమోదు చేసింది. మార్కస్ స్టోయినిస్(43 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58) హాఫ్ సెంచరీతో రాణించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది.
మార్కస్ స్టోయినీస్‌తో పాటు కేఎల్ రాహుల్(31 బంతుల్లో 3 ఫోర్లతో 33), నికోలస్ పూరన్(22 బంతుల్లో 3 ఫోర్లతో 32 నాటౌట్), ఆయుష్ బదోని(11 బంతుల్లో 3 ఫోర్లతో 20 నాటౌట్) రాణించారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్, దర్షన్ నల్కండే రెండేసి వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు.

క్వింటన్ డికాక్(6), దేవదత్ పడిక్కల్(7)లను ఉమేశ్ యాదవ్ వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చడంతో లక్నో సూపర్ జెయింట్స్ 18 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో కేఎల్ రాహుల్, మార్కస్ స్టోయినీస్ ఆచితూచి ఆడారు. రాహుల్ పూర్తిగా డిఫెన్స్‌కు పరిమితమయ్యాడు. దాంతో ఆ జట్టు పవర్ ప్లేలో 2 వికెట్లకు 47 పరుగులే చేసింది.
మరోవైపు మార్కస్ స్టోయినీస్ ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా.. కేఎల్ రాహుల్ మాత్రం జిడ్డూ బ్యాటింగ్‌తో విసిగించాడు. 31 బంతులు ఆడిన రాహుల్ కేవలం మూడు బౌండరీలు మాత్రమే బాదాడు. ధాటిగా ఆడే క్రమంలో దర్షన్ నల్కండే బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. రాహుల్ జిడ్డు బ్యాటింగ్.. స్టోయినిస్ బ్యాటింగ్‌పై ప్రభావం చూపించింది.
అతను తీవ్ర ఒత్తిడికి గురై వేగంగా ఆడే క్రమంలో ఔటవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. నికోలస్ పూరన్, ఆయూష్ బదోని ధాటిగా ఆడి చివరి 5 ఓవర్లలో51 పరుగులు చేయడంతో లక్నో పోరాడే లక్ష్యాన్ని నమోదు చేయగలిగింది.