లక్నో: లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ తన మాస్టర్ మైండ్‌తో క్రికెట్ అభిమానులను ఫిదా చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో తొలి మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను సరైన సమయంలో ఉపయోగించుకొని ఫలితం రాబట్టాడు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉద్దేశాన్ని అభిమానులకు చాటి చెప్పాడు. లక్నో ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో ఆయూష్ బాదోని ఔటైన వెంటనే అతని స్థానంలో కృష్ణప్ప గౌతమ్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా క్రీజులోకి పంపించాడు.
ఇన్నింగ్స్ చివరి బంతిని మాత్రమే ఎదుర్కొన్న గౌతమ్.. భారీ సిక్సర్‌తో జట్టుకు కావాల్సిన ఫినిషింగ్ ఇచ్చాడు. ఈ సిక్సర్‌తో 193 పరుగుల మార్క్‌ను అందుకున్న లక్నో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. తుది జట్టులో లేని గౌతమ్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా పంపించకుంటే లక్నోకు ఈ సిక్సర్ వచ్చేది కాదు. దాంతోనే గౌతమ్ గంభీర్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు చేసింది. కైల్ మేయర్స్(38 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 73) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగగా.. చివర్లో నికోలస్ పూరన్(21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 36), ఆయూష్ బదోని(18) మెరుపులు మెరిపించారు.
పేలవ ఆరంభంతో పవర్ ప్లేలో 30 పరుగులు మాత్రమే చేసిన లక్నో.. కైల్ మేయర్స్ విధ్వంసంతో భారీ స్కోర్ అందుకుంది. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, చేతన్ సకారియా రెండేసి వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ దక్కించుకున్నారు.
చేతన్ సకారియా వేసిన ఆఖరి ఓవర్ లక్నో సూపర్ జెయింట్స్‌కు కలిసొచ్చింది. ఈ ఓవర్‌లో మూడు వైడ్లు వేసిన సకారియా.. తర్వాత మూడు సిక్స్‌లు సమర్పించుకున్నాడు. ఆయూష్ బదోని వరుసగా రెండు సిక్స్‌లు కొట్టి వెనుదిరగ్గా అతని స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన కృష్ణప్ప గౌతమ్ భారీ సిక్సర్‌తో ఇన్నింగ్స్‌ను ముగించాడు. దాంతో ఈ ఓవర్‌లో 22 పరుగులు వచ్చాయి. 170-180 పరుగులకు పరిమితం కావాల్సిన లక్నో 193 పరుగులు చేయగలిగింది.