టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. ప్రత్యర్థి ఆటగాళ్ల కష్టానికి క్రెడిట్ ఇవ్వడంలో ఎప్పుడూ ముందుండే ధోనీ.. తాజాగా ఆ విషయాన్ని రుజువు చేశాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో సోమవారం లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వరుసగా ఐదు పరాజయాల తర్వాత విజయాన్నందుకుంది.
ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ధోనీ(11 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 26 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెన్నైకి విజయాన్నందించాడు. ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌లో తనదైన హిట్టింగ్‌తో విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. దాంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అతనికి దక్కింది. అయితే ఈ అవార్డ్ తనకు ఎందుకు ఇస్తున్నారని, నూర్ అహ్మద్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని, ఇది అతనికి దక్కాల్సిందని పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో అభిప్రాయపడ్డాడు. హోస్ట్ మురళీ కార్తీక్.. 18వ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ గెలవడం ఎలా అనిపిస్తుందని ప్రశ్నించగా.. ధోనీ భిన్నంగా స్పందించాడు.

'నాకు ఎందుకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ ఇస్తున్నారా? అని ఆలోచిస్తున్నాను. ఈ అవార్డ్ కోసం ఇతర వ్యక్తలు ఉన్నారు. నా కంటే నూర్ అహ్మద్, రవీంద్ర జడేజా మెరుగైన ప్రదర్శన చేశారు. ఈ ఇద్దరూ మిడిల్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేశారు.'అని ధోనీ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన నూర్ అహ్మద్ ఒక్క వికెట్ తీయకపోయినా 13 పరుగులే ఇచ్చాడు. మరోవైపు జడేజా మూడు ఓవర్లలో 24 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసింది. రిషభ్ పంత్(49 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 63) హాఫ్ సెంచరీతో రాణించాడు. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా(2/24), మతీష పతీరణ(2/45) రెండేసి వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసి గెలుపొందింది. ధోనీ(11 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 26 నాటౌట్)తో పాటు శివమ్ దూబే(37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43 నాటౌట్), రచిన్ రవీంద్ర(22 బంతుల్లో 5 ఫోర్లతో 37), అరంగేట్ర ప్లేయర్ షేక్ రషీద్(19 బంతుల్లో 6 ఫోర్లతో 27) రాణించారు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో రవి బిష్ణోయ్(2/18) రెండు వికెట్లు తీయగా.. దిగ్వేజ్ రతి, ఆవేశ్ ఖాన్, ఎయిడెన్ మార్క్‌రమ్ తలో వికెట్ తీసారు. సీఎస్‌కే ఓటమి ఖాయమనుకున్న పరిస్థితుల్లో ధోనీ దూకుడుగా ఆడి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.