ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తమ పరాజయాల పరంపరకు బ్రేక్ వేసింది. వరుసగా ఐదు పరాజయాల తర్వాత రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో సోమవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(11 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 26 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెన్నై సూపర్ కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసింది. రిషభ్ పంత్(49 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 63) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిచెల్ మార్ష్(25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30), అబ్దుల్ సమద్(11 బంతుల్లో 2 సిక్స్‌లతో 20) కీలక ఇన్నింగ్స్ ఆడారు. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా(2/24), మతీష పతీరణ(2/45) రెండేసి వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్ చెరో వికెట్ పడగొట్టారు.

అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసి గెలుపొందింది. ధోనీతో పాటు శివమ్ దూబే(37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43 నాటౌట్), రచిన్ రవీంద్ర(22 బంతుల్లో 5 ఫోర్లతో 37), అరంగేట్ర ప్లేయర్ షేక్ రషీద్(19 బంతుల్లో 6 ఫోర్లతో 27) రాణించారు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో రవి బిష్ణోయ్(2/18) రెండు వికెట్లు తీయగా.. దిగ్వేజ్ రతి, ఆవేశ్ ఖాన్, ఎయిడెన్ మార్క్‌రమ్ తలో వికెట్ తీసారు. సీఎస్‌కే ఓటమి ఖాయమనుకున్న పరిస్థితుల్లో ధోనీ దూకుడుగా ఆడి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.
చెలరేగిన తెలుగోడు..
లక్ష్యచేధనలో సీఎస్‌కేకు ఓపెనర్లు షేక్ రషీద్, రచిన్ రవీంద్ర శుభారంభం అందించారు. ముఖ్యంగా అరంగేట్ర ప్లేయర్, తెలుగు తేజం షేక్ రషీద్ దూకుడుగా ఆడాడు. 6 బౌండరీలతో వేగంగా పరుగులు రాబట్టాడు. అయితే అతన్ని ఆవేష్ ఖాన్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చడంతో తొలి వికెట్‌కు నమోదైన 52 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి రాహుల్ త్రిపాఠి రాగా.. నిలకడగా ఆడుతున్న రచిన్ రవీంద్రను ఎయిడెన్ మార్క్‌రమ్ ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు.
తడబడ్డ మిడిలార్డర్..
ఆ తర్వాత వరుస విరామాల్లో చెన్నై సూపర్ కింగ్స్ వికెట్లు కోల్పోయింది. రాహుల్ త్రిపాఠి(9)ని రవి బిష్ణోయ్ రిటర్న్ క్యాచ్‌గా ఔట్ చేయగా.. రవీంద్ర జడేజా(7) రవి బిష్ణోయ్ పెవిలియన్ చేర్చాడు. లక్నో బౌలర్లు కట్టడిగా బౌలింగ్ చేయడంతో ఒత్తిడికి గురైన విజయ్ శంకర్(9) భారీ షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో చెన్నై 111 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.
మలుపు తిప్పిన ధోనీ..
క్రీజులోకి వచ్చిన ధోనీ.. ఆవేశ్ ఖాన్ వేసిన 16వ ఓవర్‌లో వరుసగా రెండు బౌండరీలు బాది జోరు కనబర్చాడు. ధోనీ వచ్చి ఉత్సాహమో ఏమో తెలియదు కానీ.. అప్పటి వరకు తీవ్రంగా ఇబ్బంది పడిన శివమ్ దూబే దూకుడుగా ఆడాడు. శార్దూల్ వేసిన 17వ ఓవర్‌లో శివమ్ దూబే ఓ బౌండరీ బాదగా.. ధోనీ సిక్సర్ కొట్టాడు.
ఆవేశ్ ఖాన్ వేసిన 18వ ఓవర్‌లో ధోనీ ఫోర్ కొట్టగా దూబే మూడు బాల్స్‌ను డాట్ చేశాడు. కానీ శార్దూల్ ఠాకూర్ వేసిన 19వ ఓవర్‌లో శివమ్ దూబే వరుసగా 4, 6 బాదగా.. ధోనీ ఇచ్చిన క్యాచ్‌ను రవి బిష్ణోయ్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో ధోనీ ఆఖరి బంతిని బౌండరీకి తరలించి సీఎస్‌కే విజయాన్ని ఖాయం చేశాడు. ఆఖరి ఓవర్‌లో చెన్నై విజయానికి 5 పరుగులు అవసరమవ్వగా.. శివమ్ దూబే బౌండరీ బాది విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ ఇద్దరూ 6వ వికెట్‌కు అజేయంగా 57 పరుగులు జోడించారు.
నిరాశపర్చిన మార్క్‌రమ్, పూరన్..
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్‌కు తొలి ఓవర్‌లోనే బిగ్ షాక్ తగిలింది. ఖలీల్ అహ్మద్ వేసిన తొలి ఓవర్‌లోనే ఎయిడెన్ మార్క్‌రమ్(6) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్(8)ను అన్షుల్ కంబోజ్ ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్‌తో కలిసి మిచెల్ మార్ష్ చెలరేగాడు. ఖలీల్ బౌలింగ్‌లో మార్ష్ 4, 6 బాదగా.. పంత్ ఓ ఫోర్ కొట్టాడు. దాంతో పవర్ ప్లేలో ఢిల్లీ 2 వికెట్లకు 42 పరుగులే చేసింది. అనంతరం పంత్ ఓ భారీ సిక్సర్ కొట్టగా.. నూర్ అహ్మద్ కట్టడిగా బౌలింగ్ చేశాడు. దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన మిచెల్ మార్ష్‌ను జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 50 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
బదోనికి రెండు లైఫ్స్
క్రీజులోకి వచ్చిన ఆయుష్ బదోని 2 సిక్సర్లతో పాటు ఓ బౌండరీ బాది దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతనికి మూడు లైఫ్స్ లభించాయి. పతీరణ బౌలింగ్‌లో అతను క్యాచ్ ఔట్ అవ్వగా.. అది నో బాల్ అయ్యింది. ఇదే ఓవర్‌లో రెండో బౌన్సర్ కావడంతో అంపైర్లు భుజం హైట్‌ను మాత్రమే పరిగణలోకి తీసుకొని నో బాల్ ఇచ్చారు. ఆ తర్వాత జడేజా బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోగా.. అంపైర్ ఔటిచ్చాడు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేసిన అతను ఆశించిన ఫలితాన్ని రాబట్టాడు. రివ్యూలో బంతి గ్లౌవ్స్‌ను తాకినట్లు తేలింది. ఆ తర్వాత ఓ రనౌట్ అవకాశం చేజారింది.
ఆదుకున్న రిషభ్ పంత్..
ఇదే ఓవర్ ఆఖరి బంతికి ఆయుష్ బదోని స్టంపౌటయ్యాడు. అబ్దుల్ సమద్‌తో కలిసి పంత్ జట్టును ముందుకు నడిపించాడు. సమద్ ఓ భారీ సిక్సర్ బాదగా.. పంత్ పతీరణ బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు కొట్టి 42 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన పంత్.. అదే జోరులో ఓ క్యాచ్ ఇచ్చాడు. కానీ షేక్ రషీద్ నేలపాలు చేశాడు. ఆఖరి ఓవర్‌లో అబ్దుల్ సమద్ రనౌటవ్వగా.. పంత్ క్యాచ్ ఔటయ్యాడు. బౌండరీ బాదిన శార్దూల్ ఠాకూర్.. ఆఖరి బంతికి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో లక్నో 166 పరుగులకే పరిమితమైంది.