ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్, డ్యూ వచ్చే అవకాశం ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. తుది జట్టులో రెండు మార్పులు చేశామని చెప్పిన ధోనీ.. రవిచంద్రన్ అశ్విన్, డెవాన్ కాన్వేల స్థానంలో ఓవర్టన్, షేక్ రషీద్‌ను తీసుకున్నామని పేర్కొన్నాడు.
'మేం చాలా అదృష్టవంతులం. మేం ఎక్కడికి వెళ్లినా ప్రేక్షకుల మద్దతు లభిస్తోంది. ఫ్యాన్స్ అందరికి ధన్యవాదాలు. మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. డ్యూ వచ్చే అవకాశం ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో పిచ్ బ్యాటింగ్‌కు మరింత అనుకూలంగా మారనుంది. సరైన టెంపర్‌మెంట్ సెట్ చేయడం ముఖ్యం. మా బ్యాటింగ్‌లో నిలకడ లేదు. బంతితోనూ మేం మరింత మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది.

సానుకూల ఆలోచన విధానంతో బరిలోకి దిగడం ముఖ్యం. భారీ షాట్ల ఆడటం పెద్ద విషయం కాదు. తుది జట్టులో రెండు మార్పులు చేశాం. అశ్విన్, కాన్వే స్థానాల్లో ఓవర్టన్, షేక్ రషీద్ తుది జట్టులోకి వచ్చారు.'అని టాస్ సందర్భంగా ధోనీ తెలిపాడు.
తెలుగు తేజం షేక్ రషీద్.. ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేస్తున్నాడు. వరుస పరాజయాల నేపథ్యంలోనే సీఎస్‌కే టీమ్ కాంబినేషన్‌లో మార్పులు చేసింది. వరుసగా విఫలమవుతున్న అశ్విన్‌పై వేటు వేసింది.
మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ తెలిపాడు. 'మేం కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. లక్నో వికెట్ తొలి ఇన్నింగ్స్‌లో నెమ్మదిగా ఉంటుంది. మ్యాచ్ సాగుతున్నా కొద్దీ బ్యాటింగ్‌కు సహకరిస్తోంది. సీఎస్‌కే మేం ఎలాంటి అవకాశం ఇవ్వం. గెలుపు కోసం 100 శాతం ప్రయత్నిస్తాం. మేం మెరుగైన క్రికెట్ ఆడాలనుకుంటున్నాం. తుది జట్టులో ఒకే ఒక్క మార్పు చేశాం. హిమ్మత్ సింగ్ స్థానంలో మిచెల్ మార్ష్ తిరిగి వచ్చాడు.'అని రిషభ్ పంత్ తెలిపాడు.
తుది జట్లు:
లక్నో సూపర్ జెయింట్స్: ఎయిడెన్ మార్క్‌రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, రిషభ్ పంత్(కీపర్), డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, అవేష్ ఖాన్, ఆకాష్ దీప్, దిగ్వేష్ సింగ్ రాఠీ
చెన్నై సూపర్ కింగ్స్ : షేక్ రషీద్, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, జామీ ఓవర్టన్, ఎంఎస్ ధోనీ(కీపర్, కెప్టెన్), అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరణ.