ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా టీమిండియా స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో రిషభ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ. 27 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.
అయితే పంత్ కోసం తాము ఎక్కువగానే ఖర్చు చేశామని ఒప్పుకున్నాడు. అతను రూ. 26 కోట్లకే దక్కాల్సిందని, కానీ తాము ఒక కోటీ ఎక్కువగా ఖర్చు చేశామని తెలిపాడు. అయితే ఇందుకు తాము ఏం భాదపడటం లేదని, ప్రణాళిక ప్రకారం పంత్‌ను కొనుగోలు చేయడం సంతోషంగా ఉందని చెప్పాడు. మెగా ఆక్షన్ బ్రేక్ సమయంలో మాట్లాడిన సంజీవ్ గోయెంకా.. పంత్‌ను కొనుగోలు చేయడానికి గల కారణాన్ని వెల్లడించాడు.

'రిషభ్ పంత్.. మా ఆక్షన్ ప్లాన్‌లో ఉన్నాడు. అందుకే అతని కోసం భారీగా ఖర్చు చేశాం. అతను మాకు అన్ని విధాల ఉపయోగపడనున్నాడు. మంచి కెప్టెన్‌తో పాటు వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్. క్షణాల్లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలిగే ఫినిషర్. అందుకే ధర ఎక్కువైనా పంత్‌ను కొనుగోలు చేశాం. రిషభ్ పంత్‌ను కొనుగోలు చేయడంపై మా ఫ్రాంచైజీ అభిమానులంతా సంతోషంగా ఉన్నారు.'అని సంజీవ్ గోయెంకా చెప్పుకొచ్చాడు.
అతని కుమారుడు సస్వాత్ గోయెంకా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ధర ఎక్కువైన పంత్‌ను కొనుగోలు చేయడం సంతోషంగా ఉందని చెప్పాడు. ఆర్‌టీఎమ్ కార్డుతో పంత్ చేజారవద్దనే రూ. 27 కోట్ల భారీ ధరకు బిడ్ వేసామని స్పష్టం చేశాడు.
రిషభ్ పంత్‌తో పాటు శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్ భారీ ధర పలికారు. శ్రేయస్ అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ రూ. 26.75 కోట్ల భారీ ధరకు తీసుకోగా.. వెంకటేశ్ అయ్యర్‌ను కేకేఆర్ రూ. 23.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు ఈ ముగ్గురే అత్యధిక ధర పలికి ఆటగాళ్లుగా నిలిచారు.