
కొలంబో: కరోనా వైరస్ కారణంగా రెండుసార్లు వాయిదా పడ్డ లంక ప్రీమియర్ లీగ్(ఎల్‌పీఎల్) వచ్చే నెలలో షురూ కానుంది. ఈ లీగ్‌లో మొత్తం ఐదు జట్లు పోటీపడుతుండగా ఓ ఫ్రాంచైజీని బాలీవుడ్ కండల వీరుడు, మోస్ట్ బ్యాచులర్ హీరో సల్మాన్ ఖాన్ కుటుంబ సభ్యులు కొనుగోలు చేశారు. సల్మాన్ ఖాన్ తమ్ముడు సోహైల్ ఖాన్, తండ్రి ప్రముఖ స్క్రిప్ట్ రైటర్ సలీమ్ ఖాన్ ఇద్దరు కలిసి క్యాండీ టస్కర్స్ జట్టును తీసుకున్నారు.
సోహైల్ ఖాన్ ఇంటర్నేషనల్ ఎల్‌ఎల్‌పీ పేరిట ఇన్వెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఖాన్ సోదరులు మంగళవారం ధృవీకరించారు. ఇక ఈ మ్యాచ్‌లకు సల్మాన్ ఖాన్ హాజరవుతాడని సోహైల్ ఖాన్ టైమ్స్ ఇండియాకు తెలిపారు. శ్రీలంక క్రికెటర్లు కుసాల్ పెరెరా, కుసాల్ మెండిస్, అసెల గుణరత్నేలతో పాటు వాహెబ్ రియాజ్, క్రిస్ గేల్, లియమ్ ప్లంకెట్ వంటి విదేశీ ఆటగాళ్లున్నారని పేర్కొన్నారు. లీగ్‌లో విదేశీ ఆటగాళ్ల ఉండటంపై సోహైల్ సంతోషం వ్యక్తం చేశారు 'గేల్ యూనివర్సల్ బాస్. కానీ మాకు మంచి జట్టు ఉంది. కుసాల పెరెరా మాకు లోకాల్ ఐకాన్, ప్లంకెట్, వాహబ్ రియాజ్, కుసాల మెండిస్, నువాన్ ప్రదీప్‌లతో యువ, అనుభవజ్ఞులతో జట్టు సమతూకంగా ఉంది.'అని తెలిపాడు.
ఈ లీగ్ ఆలస్యం కావడంతో క్రిస్ గేల్, డుప్లెసిస్ వంటి ఆటగాళ్లు అక్కడ ఆడేందుకు అవకాశం లభించింది. ప‍్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న వీరిద్దరూ యూఏఈ నుంచి నేరుగా శ్రీలంక వెళ్లనున్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈ టీ20 శ్రీలంక టోర్నమెంట్ ఆగస్టులో ఆరంభం కావాల్సి ఉంది. కానీ అది నవంబర్ 14కు వాయిదా పడింది. ఈ లీగ్‌లో గేల్, డుప్లెసిస్‌లతో పాటు షాహిద్ ఆఫ్రిది, కార్లోస్ బ్రాత్‌వైట్‌లు కూడా ఆడనున్నారు.
సుమారు 20 మందికి పైగా విదేశీ ఆటగాళ్లు ఆ లీగ్‌లో ఆడటానికి సుముఖుత వ్యక్తం చేయడంతో ఆ లీగ్ అదనపు అట్రాక్షన్ వచ్చే అవకాశం ఉంది. కరోనా నిబంధనల మధ్యే ప్రేక్షకుల్లేకుండా ఈ లీగ్ జరగనుంది. నవంబర్ 14 నుంచి డిసెంబర్ 13వ తేదీ వరకూ ఈ లీగ్‌ను నిర్వహించనున్నారు. ఇందులో ఐదు ఎల్‌పీఎల్ జట్లు ఉండగా ప్రతీ ఫ్రాంచైజీ ఆరుగురు విదేశీ ఆటగాళ్లను తీసుకునే వీలుంది. ఇదే తొలి ఎడిషన్ కావడం గమనార్హం.