టాపార్డర్ వైఫల్యం వల్లే వెస్టిండీస్ చేతిలో ఘోర పరాజయం ఎదుర్కొన్నామని పాకిస్థాన్ వన్డే కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ అన్నాడు. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోవడం తమ విజయవకాశాలను దెబ్బతీసిందని చెప్పాడు. వెస్టిండీస్ బ్యాటర్ షై హోప్ పవర్ హిట్టింగ్ తమను కోలుకోలేకుండా చేసిందన్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో వెస్టిండీస్ 202 పరుగుల భారీ తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో 34 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌పై మూడు వన్డేల సిరీస్‌ను వెస్టిండీస్ 2-1తో కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 294 పరుగులు చేసింది. షైహోప్(94 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో 120) సెంచరీతో రాణించాడు. పాకిస్థాన్ బౌలర్లలో నసీమ్ షా(2/72), అబ్రర్ అహ్మద్(2/34) రెండేసి వికెట్లు తీయగా.. సయీమ్ ఆయుబ్, మహమ్మద్ నవాజ్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం పాకిస్థాన్ 29.2 ఓవర్లలో 92 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సల్మాన్ అఘా(30), మహమ్మద్ నవాజ్(23 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
పాకిస్థాన్ జట్టులో మొత్తం ఐదుగురు బ్యాటర్లు.. సయీమ్ ఆయుబ్(0), అబ్దుల్లా షఫీక్(0), మహమ్మద్ రిజ్వాన్(0), హసన్ అలీ(0), అబ్రర్ అహ్మద్(0) డకట్‌గా వెనుదిరిగారు. బాబర్ ఆజామ్(9)కూడా నిరాశపర్చాడు. వెస్టిండీస్ బౌలర్లలో జైడెన్ సీల్స్(6/18) ఆరు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. గుడకేష్ మోతీ(2/37) రెండు వికెట్లు తీయగా.. రోస్టన్ ఛేజ్ ఓ వికెట్ పడగొట్టాడు.

ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన బాబర్ ఆజామ్.. బ్యాటింగ్ వైఫల్యం కొంపముంచిందన్నాడు. 'ఈ పిచ్‌పై వరుసగా ఇది మూడో మ్యాచ్. ఈ విషయం మాకు తెలుసు. ఈ మ్యాచ్‌లో మేం 40 ఓవర్ల పాటు బాగా ఆడాం. వెస్టిండీస్‌ను 220 పరుగులకు కట్టడి చేయగలమని భావించాం. మా బ్యాటింగ్ మెరుగ్గా ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఈ గెలుపు క్రెడిట్ షై హోప్‌దే. మా వ్యూహాలను సరిగ్గానే అమలు చేశాం. కొన్ని ఎడ్జ్‌లు మాకు కలిసి రాలేదు. కానీ షై హోప్ పవర్ హిట్టింగ్ మాత్రం అసాధారణం.
మాకు ఐదుగురు బౌలర్లు లేరని మీరు విమర్శించవచ్చు. కానీ, సైమ్, సల్మాన్ బౌలింగ్ చేయగలరు. అబ్రార్‌తో ఆలస్యంగా బౌలింగ్ చేయించాలనుకున్నాను. కానీ వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటింగ్ వల్ల అతనితో బౌలింగ్ వేయించడం కుదురలేదు. సీల్స్ మమ్మల్ని కట్టడి చేశాడు. ఈ మ్యాచే కాదు ఈ సిరీస్ ఆసాంతం రాణించాడు. ఆరంభంలోనే మూడు కీలకమైన వికెట్లు కోల్పోయాం. అదే మా పతనాన్ని శాసించింది.'అని రిజ్వాన్ చెప్పుకొచ్చాడు.