ఇంగ్లండ్ పర్యటనను టీమిండియా విజయంతో ముగించింది. ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీని 2-2తో సమం చేసుకుంది. ఓవల్ వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్‌లో టీమిండియా చిరస్మరణీయమైన విజయాన్నందుకుంది. ఆఖరి రోజు వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ సంచలన ప్రదర్శనతో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. అయితే ఓవల్ టెస్ట్ విజయంలో ఆధ్యాత్మికత కూడా భాగమైందని ఓ జాతీయ ఛానెల్ పేర్కొంది.
ఓవల్ మ్యాచ్ గెలిచే వరకు భారత డ్రెస్సింగ్ రూమ్‌లో శివ రుద్రాష్టకం, హనుమాన్ చాలీసా మారమోగిందంట. ఈ విషయాన్ని భారత జట్టులోని ఆటగాళ్లే వెల్లడించారని సదరు వెబ్‌సైట్ రాసుకొచ్చింది. 16వ శతాబ్దానికి చెందిన శ్రీ శివ రుద్రాష్టకం స్తోత్రాన్ని ప్లే చేయడంతో ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెరిగిందని, ఇది ఒక అద్భుతమైన అనుభూతిని కలిగించిందని టీమిండియా ఆటగాళ్లు చెప్పినట్లు తమ కథనంలో పేర్కొంది.

ఓవల్ టెస్టు ఐదు రోజుల పాటు భారత డ్రెస్సింగ్ రూమ్‌లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొందని, తొలి రోజు ఆటలో వికెట్లు పడగానే జట్టు సీనియర్ సభ్యుడు ఒకరు కొత్తగా ఈ ప్రయోగం చేశాడని తెలిపింది. 'ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 1 - 2తో వెనుకబడి ఉంది. ఆఖరి టెస్టు గెలిస్తేనే సిరీస్ సమం అవుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ త్వరగా ఔటయ్యారు. దాంతో భారత్ 38 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న వారంత ఆందోళనకు గురయ్యాడు.
అప్పుడే జట్టు సీనియర్ త్రోడౌన్ స్పెషలిస్ట్ రాఘవేంద్ర లౌడ్ స్పీకర్‌లో శ్రీ శివ రుద్రాష్టకం ప్లే చేశాడు. తొలి రోజు నుంచి ఆఖరి రోజు వరకూ ఆ స్తోత్రం డ్రెస్సింగ్ రూమ్‌ని ఆధ్యాత్మికతగా మార్చేసింది. అయితే ఇది ముందుగా ప్లాన్ చేసింది కాదు. కానీ శివ రుద్రాష్టకం ప్లే చేసిన తర్వాత ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది.
వాస్తవానికి మేం ప్రాక్టీస్ సెషన్ ముందు లేదా తర్వాత పాటలు ప్లే చేస్తాం. కొన్నిసార్లు హనుమాన్ చాలీసా కూడా వింటాం. కానీ ఇంత హై ప్రెజర్ టెస్టులో ఐదు రోజులు వరుసగా రుద్రాష్టకం వినడం మాకు కొత్తగా అనిపించింది" అని జట్టు సభ్యుడు ఒకరు చెప్పినట్లు సదరు ఛానెల్ పేర్కొంది.