అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించడంపై స్టార్ ఓపెనర్ సంజూ శాంసన్ సంతోషం వ్యక్తం చేశాడు. తన జీవితంలోనే ఇదో గొప్ప ఇన్నింగ్స్ అని అభివర్ణించాడు. ఆ దేవుడి దయతోనే ఈ ఇన్నింగ్స్ సాధ్యమైందని చెప్పుకొచ్చాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో భాగంగా వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలుపొంది సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సంజూ శాంసన్ (50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 97 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన సంతోషం వ్యక్తం చేసిన సంజూ.. కోహ్లీ, రోహిత్, ధోనీ వంటి దిగ్గజాలను చూసే ఇలా ఆడటం నేర్చుకున్నానని తెలిపాడు.

'ఈ ఇన్నింగ్స్ నాకు ప్రపంచంతో సమానం. ఇది నా జీవితం. నేను క్రికెట్ ఆడటం మొదలు పెట్టినప్పటి రోజు నుంచి దేశం కోసం ఆడాలని కలలు కన్నాను. ఇలాంటి ఇన్నింగ్స్ కోసమే నిరీక్షిస్తున్నాను. నా క్రికెట్ ప్రయాణం చాలా ప్రత్యేకం. ఇందులో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. నేను సాధించగలనా? అని నాకు నేను ఎన్నోసార్లు సందేహించుకున్నాను. కానీ ఈ రోజు నన్ను దీవించినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
నేను చాలా ఏళ్లుగా టీ20 ఫార్మాట్ ఆడుతున్నాను. కోహ్లీ,రోహిత్ శర్మ, ధోనీ వంటి దిగ్గజాల నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఆ అనుభవం నాకు ఎంతగానో సహాయపడింది. గొప్ప ఆటగాళ్లు పరిస్థితులకు తగ్గట్టుగా తమ ఆటను ఎలా మార్చుకుంటారో నేను గమనించాను. గత మ్యాచ్‌లో మేం ముందుగా బ్యాటింగ్ చేశాం. కాబట్టి తొలి బంతి నుంచే నేను దూకుడుగా ఆడాను.
కానీ ఈ మ్యాచ్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. నేను వేగంగా ఆడటానికి ప్రయత్నించిన ప్రతీసారి మేం వికెట్లు కోల్పోయాం. నేను ఇంతటి గొప్ప ఇన్నింగ్స్ ఆడుతానని కలలో కూడా అనుకోలేదు. కానీ నా జీవితంలోనే అత్యుత్తమ రోజుల్లో ఇది ఒకటి. నేను కేవలం వర్తమానంలో ఉంటూ.. బంతి మెరిట్‌ను బట్టి ఆడాను.'అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. రోస్టన్ ఛేజ్(25 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 40), రోవ్‌మన్ పోవెల్(19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34 నాటౌట్), జాసన్ హోల్డర్(22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(2/36) రెండు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ తీసారు.
అనంతరం భారత్19.2 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులు చేసి గెలుపొందింది. సంజూ శాంసన్ (50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 97 నాటౌట్) ఒక్కడే అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. తిలక్ వర్మ(15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 27) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వెస్టిండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్(2/38), షమార్ జోషెఫ్(2/42) రెండేసి వికెట్లు తీయగా.. అకీల్ హోస్సేన్ ఒక వికెట్ తీసాడు.