టెస్ట్ క్రికెట్‌లో 100 మ్యాచ్‌ల మైలురాయి అందుకునేందుకు సిద్దమైన టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. అశ్విన్ సాధించే ఈ ఫీట్ చాలా గొప్పదని మాజీ క్రికెటర్లు, అభిమానులు కొనియాడుతుంటే.. మాజీ క్రికెటర్, దిగ్గజ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ మాత్రం అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
100వ టెస్ట్ ఆడుతున్న సందర్భంగా అభినందనలు తెలియజేయాలని తాను ఫోన్ చేస్తే అశ్విన్ కాల్ కట్ చేశాడని, మెసేజ్ చేస్తే కనీసం రిప్లే కూడా ఇవ్వలేదని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు.

'100వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న అశ్విన్‌కు అభినందనలు తెలిపేందుకు పలుమార్లు ఫోన్ చేశాను. కానీ అతను నా కాల్ కట్ చేశాడు. మెసేజ్ చేస్తే కనీసం రిప్లే కూడా ఇవ్వలేదు. మాజీ క్రికెటర్లకు దక్కుతున్న గౌరవం ఇది.'అని లక్ష్మణ్ శివరామకృష్ణన్ అసహనం వ్యక్తం చేశాడు.
శివరామకృష్ణన్, అశ్విన్‌లు ఇద్దరూ తమిళనాడుకు చెందినవారే కావడం విశేషం. తమ రాష్ట్రానికి చెందిన దిగ్గజ ప్లేయర్ ఫోన్ చేస్తే అశ్విన్ స్పందించకపోవడం ఏంటని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అయితే గతంతో అశ్విన్ రికార్డుల కోసం ఆడుతాడని శివరామకృష్ణన్ విమర్శించాడని, అది మనసులో పెట్టుకొని మాట్లాడటం లేదని మరికొందరు అభిమానులు పేర్కొంటున్నారు.
ఈ వ్యాఖ్యలపై కూడా లక్ష్మణ్ శివరామకృష్ణన్ వివరణ ఇచ్చారు. అది టెక్నికల్ అబ్జర్వేషన్ మాత్రమేనని, విమర్శ, కించపరచడం కాదని స్పష్టం చేశాడు.
'రికార్డుల కోసమే ఆడుతాడని నేను చెప్పినది విమర్శ, కించపరచడం ఏ మాత్రం కాదు. అది టెక్నికల్ పరిశీలన మాత్రమే. అది మంచి ఉద్దేశంతో చెప్పింది. సలహాలను కూడా మీరు ఇన్‌సల్ట్‌గా.. నేరంగా భావిస్తారు. ఆ దేవుడే మిమ్మల్ని రక్షిస్తాడు. క్రికెట్‌లో నాకు 43 ఏళ్ల అనుభవం ఉంది. ఆట పట్ల కాస్త అవగాహన ఉంది.'అని లక్ష్మణ్ శివరామకృష్ణన్ ఘాటుగా బదులిచ్చాడు.
ఇంగ్లండ్‌తో ధర్మశాల వేదికగా గురువారం నుంచి ప్రారంభమయ్యే ఐదో టెస్ట్‌తో అశ్విన్.. కెరీర్‌లో 100 మ్యాచ్‌ల మైలురాయి అందుకుంటాడు. ఈ ఘనత సాధించిన 14వ భారత ప్లేయర్‌గా చరిత్రకెక్కుతాడు. ఇదే మ్యాచ్‌తో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో కూడా 100 టెస్ట్‌ల ఘనతను అందుకోనున్నాడు. ఇలా ప్రత్యర్థి ఆటగాళ్లు ఒకే మ్యాచ్‌లో 100వ టెస్ట్ పూర్తి చేసుకోవడం 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది మూడో సారి మాత్రమే కావడం విశేషం.