టీమిండియా మాజీ లెగ్ స్పిన్నర్, ప్రముఖ కామెంటేటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ సంచలన ఆరోపణలు చేశారు. నల్లగా ఉన్నానని తన పట్ల వివక్ష చూపారని తెలిపారు. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు బీసీసీఐ కామెంట్రీకి వీడ్కోలు పలికారు. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా శివరామకృష్ణన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా బీసీసీఐతో పాటు మ్యాచ్ నిర్వాహకులు, బ్రాడ్‌కాస్టర్స్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
కామెంటేటర్‌గా తీవ్రమైన వివక్ష గురైనట్లు తెలిపారు. తాను గత 23 ఏళ్లుగా కామెంటరీ చేస్తున్నప్పటికీ.. తనకు కనీసం టాస్ వేసే అవకాశం లేదా ప్రెజెంటేషన్ ఇచ్చే అవకాశం కూడా రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రవిశాస్త్రి కోచ్‌గా ఉన్న సమయంలో కూడా కొత్తగా వచ్చిన వారికి ప్రజెంటర్‌గా అవకాశాలు ఇచ్చారని, తనకు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. దీనికి కారణం 'రంగు వివక్షేనా' అని ఒక యూజర్ అడిగిన ప్రశ్నకు ఆయన అవునని సమాధానమిచ్చారు. తాను నల్లగా ఉండటంతో ప్రజెంటర్‌గా ఛాన్స్ ఇవ్వలేదని స్పష్టం చేశారు.

'నా రిటైర్మెంట్ అనేది ఒక పెద్ద కథకు ఆరంభం మాత్రమే. నేను అసలు నిజాలు చెబితే సామాన్య ప్రజలు, క్రికెట్ అభిమానులు దిగ్భ్రాంతికి గురవుతారు. బీసీసీఐ కూడా నమ్మలేని నిజాలు బయటపెడతాను'అని ఆయన హెచ్చరించారు. అయితే లక్ష్మణ్ శివరామకృష్ణన్ ఇలా సంచలన ట్వీట్స్ చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ అతను ఇదే తరహాలో ట్వీట్స్ చేసి వార్తల్లో నిలిచారు. అయితే ప్రజెంటర్‌గా తనకు అవకాశం ఇవ్వలేదని ఆరోపణల్లో నిజం లేదు. పలు మ్యాచ్‌లకు పిచ్ రిపోర్ట్‌తో ప్రజెంటర్‌గా శివరామకృష్ణన్ వ్యవహరించారు. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

లక్ష్మణ్ శివరామకృష్ణన్ క్రికెట్ భారత క్రికెట్ చరిత్రలో ఒక వెలుగు వెలిగిన స్పిన్నర్. 1983లో 17 ఏళ్ల 118 రోజుల వయసులో టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి, అప్పట్లో అత్యంత చిన్న వయసులో ఆడిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించారు. ఈ రికార్డును సచిన్ అధిగమించాడు. భారత్ తరఫున 9 టెస్ట్‌లు ఆడిన 26 వికెట్లు తీసిన శివరామకృష్ణన్.. 16 వన్డేల్లో 15 వికెట్లు పడగొట్టారు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 154 వికెట్లు తీయడమే కాకుండా 5 సెంచరీలు కూడా సాధించారు.
1985లో భారత్ గెలిచిన వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ క్రికెట్ టోర్నీలో శివరామకృష్ణన్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచారు. ఈ టోర్నీలో 5 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు పడగొట్టాడు. 1987 వన్డే ప్రపంచకప్‌లో భారత్ తరపున చివరి మ్యాచ్ ఆడిన శివరామకృష్ణన్.. 1998లో ప్రొఫెషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. అప్పటి నుంచి కామెంటేటర్‌గా కొనసాగారు.