ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే)కు ఊహించని పరాజయం ఎదురైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో శుక్రవారం చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 50 పరుగుల భారీ తేడాతో చిత్తయ్యింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన సీఎస్‌కే బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లో విఫలమై మూల్యం చెల్లించుకుంది. ఈ విజయంతో ఆర్‌సీబీ 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. 2008 తర్వాత చెపాక్ మైదానం వేదికగా ఆర్‌సీబీ తొలి విజయాన్నందుకుంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులు చేసింది. రజత్ పటీదార్(32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ఫిల్ సాల్ట్(16 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 32), విరాట్ కోహ్లీ(30 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 31) రాణించారు. చివర్లో టీమ్ డేవిడ్(8 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 22 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.

అనంతరం సీఎస్‌కే.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 146 పరుగులే చేసి ఓటమిపాలైంది. రచిన్ రవీంద్ర(31 బంతుల్లో 5 ఫోర్లతో 41), మహేంద్ర సింగ్ ధోనీ(16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఆర్‌సీబీ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్(3/21), యశ్ దయాల్(2/18), లియమ్ లివింగ్ స్టోన్(2/28) రెండేసి వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్(1/20) ఓ వికెట్ పడగొట్టాడు.
అయితే సీఎస్‌కే vs ఆర్‌సీబీ మధ్య ఓ టాస్ సెంటిమెంట్ గత ఆరు మ్యాచ్‌లుగా పునరావృతం అవుతోంది. ఆశ్చర్యకరంగా ఇరు జట్లలో టాస్ గెలిచిన జట్టుకే పరాజయం ఎదురవుతోంది. ఐపీఎల్ 2022 సీజన్ నుంచి ఈ సెంటిమెంట్ రిపీట్ అవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 2022 నంచి తాజా మ్యాచ్ వరకు సీఎస్‌కే, ఆర్‌సీబీ మధ్య జరిగిన ప్రతీ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జట్టు ఓటమిపాలైంది.
గత ఆరు మ్యాచ్‌ల్లో టాస్ గెలిస్తే ఓటమే..
2022లో ఆర్‌సీబీ టాస్ గెలిస్తే.. మ్యాచ్‌లో సీఎస్‌కే విజేతగా నిలిచింది.
2022లోనే మరో మ్యాచ్‌లో సీఎస్‌కే టాస్ గెలిస్తే.. ఆర్‌సీబీ విజేతగా నిలిచింది.
2023లో ఆర్‌సీబీ టాస్ గెలిస్తే.. సీఎస్‌కే విజయం సాధించింది.
2024లో ఆర్‌సీబీ టాస్ గెలిస్తే.. సీఎస్‌కే విజేతగా నిలిచింది.
2024లోనే మరో మ్యాచ్‌లో సీఎస్‌కే టాస్ గెలిస్తే.. ఆర్‌సీబీ మ్యాచ్ గెలిచింది.
తాజా మ్యాచ్‌లోనూ సీఎస్‌కే టాస్ గెలిస్తే.. ఆర్‌సీబీ విజేతగా నిలిచింది.