IND vs WI: అతనితో పవర్ ప్లేలో బౌలింగ్ వద్దు: టీమిండియా మాజీ క్రికెటర్
టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీతో పవర్ ప్లేలో బౌలింగ్ చేయించవద్దని మాజీ పేసర్ లక్ష్మీపతి బాలాజీ సూచించాడు. పవర్ ప్లేలో ఫీల్డింగ్ రిస్ట్రిక్షన్స్ కారణంగా బ్యాటర్లు అతనిపై ఎదురు దాడికి దిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీని వరుణ్ చక్రవర్తీ ఘనంగా ప్రారంభించాడు. 4 గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో 9 వికెట్లు తీసాడు.
అయితే గత రెండు మ్యాచ్‌ల్లో వరుణ్ చక్రవర్తీ ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. 10 ప్లస్ ఎకానమీతో 82 పరుగులు సమర్పించుకొని 2 వికెట్లు మాత్రమే తీసాడు. వెస్టిండీస్‌తో టీమిండియా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కు సిద్దమైంది. కోల్‌కతా వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్ చేరనుండగా.. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించనుంది.
పవర్ ప్లేలో బౌలింగ్ వద్దు..
ఈ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తీ రాణించడం టీమిండియాకు కీలకంగా మారింది. అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడిన బాలాజీ.. వరుణ్ చక్రవర్తీ తిరిగి రిథమ్ అందుకోవాలంటే అతన్ని పవర్ ప్లే తర్వాత బౌలింగ్ చేయించాలని సూచించాడు. 'టీ20ల్లో పవర్‌ప్లేలో స్పిన్నర్ బౌలింగ్ చేస్తే.. బ్యాటర్లు ఎదురుదాడికి దిగుతారు. వరుణ్ గత కొంతకాలంగా మంచి ప్రదర్శన చేస్తున్నాడు. అతను తిరిగి మునపటి ఆత్మవిశ్వాసాన్ని పొందాలంటే పవర్ ప్లే తర్వాత బౌలింగ్ చేయాలి.

ఒకవేళ జట్టు ఒత్తిడిలో ఉంటే.. పవర్‌ప్లేలో ఒక ఓవర్ వేయించే రిస్క్ తీసుకోవచ్చు. కానీ కనీసం మూడు ఓవర్లు పవర్‌ప్లే తర్వాత వేయించడం వల్ల అతను తన రిథమ్ అందుకోగలడు. ఒక కెప్టెన్‌గా.. నేను అయితే వరుణ్ చక్రవర్తితో ఆలస్యంగా బౌలింగ్ చేయిస్తాను. రొమారియో షెపర్డ్, జేసన్ హోల్డర్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ వంటి ఆటగాళ్లను కట్టడి చేసేందుకు అతనితో రెండు ఓవర్లను చివర్లో వేయిస్తాను. వరుణ్ ఈ బ్యాటర్లకు బౌలింగ్ చేస్తున్నప్పుడు ఫీల్డింగ్ మద్దతు ఉంటుంది. అప్పుడు అతను గాలిలో నెమ్మదిగా బౌలింగ్ చేసే అవకాశం కూడా ఉంటుంది.'అని బాలాజీ సూచించాడు.
ఫినిషర్‌గా తిలక్ సరైనోడు..
టీమిండియా ఫినిషర్ పాత్ర తిలక్ వర్మకు సరిగ్గా సరిపోతుందని బాలాజీ అభిప్రాయపడ్డాడు. గత మ్యాచ్‌తో అభిషేక్ శర్మ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యిందన్నాడు. 'ఈ టోర్నీలో తిలక్ వర్మ మూడో స్థానంలో రాణించాడు. కానీ జింబాబ్వేపై అతను బ్యాటింగ్‌కు వచ్చిన స్థానం అతనికి చాలా అనువైనది. ఇన్నింగ్స్ చివరి ఏడు లేదా ఎనిమిది ఓవర్లు ఆడే సహజ సిద్ధమైన ప్రతిభ అతనిలో ఉంది. ఎక్కువ అనుభవం లేని ఆటగాడికి ఇటువంటి పరిస్థితులలో ఆడే స్వేచ్ఛ లభిస్తుంది. గత మ్యాచ్‌లో తిలక్ వర్మ విషయంలో అదే జరిగింది. భారత్‌కు లోయర్ మిడిల్ ఆర్డర్‌లో అతని వంటి నాణ్యమైన ఎడమచేతి వాటం బ్యాటర్ ఫామ్‌లో ఉండటం చాలా కీలకం.
అభిషేక్ శర్మ కీలకమైన ఆటగాడు. టోర్నమెంట్ ప్రారంభంలో అతను పరుగులు చేయకపోయినా.. గత మ్యాచ్‌లో చాలా నిలకడను ప్రదర్శించాడు. మొదటి బంతికే అవుట్ అవుతాననే ఒత్తిడి కూడా అతనికి తొలగిపోయి ఉంటుంది. టీ20 క్రికెట్‌లో ప్రతి పరుగు కూడా ఆటగాడికి ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.'అని బాలాజీ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications