
న్యూఢిల్లీ: టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై మాజీ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ సంచలన ఆరోపణలు చేశాడు. టీమిండియాకు తాను స్పిన్ కోచ్‌గా ఉంటానంటే రాహుల్ ద్రవిడ్ అంగీకరించలేదన్నాడు. దాంతో టీమిండియా తీవ్రంగా నష్టపోతుందని తెలిపాడు. ట్విటర్ వేదికగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు శివరామకృష్ణన్ ఈ విధంగా బదులిచ్చాడు.
ఆస్ట్రేలియాతో చెన్నై వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా 21 పరుగుల తేడాతో ఓటమిపాలై సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్పిన్నర్లు చెలరేగగా.. భారత స్పిన్నర్లు దారుణంగా విఫలమయ్యారు. కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టినా 50 పరుగులు సమర్పించుకున్నాడు. అక్షర్ పటేల్ 8 ఓవర్లలో 57 పరుగులిచ్చి రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. రవీంద్ర జడేజా కాస్త పొదుపుగా బౌలింగ్ చేసినా వికెట్లు తీయలేదు. ఆసీస్ స్పిన్నర్లు ఆడమ్ జంపా, అష్టన్ అగర్‌లు మాత్రం భారత పతనాన్ని శాసించాడు. భారత స్టార్ బ్యాటర్లను వరుసగా పెవిలియన్ చేర్చారు.
ఈ క్రమంలోనే ట్విటర్ వేదికగా ఓ అభిమాని 'కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చేసినప్పుడు సరైన ఫీల్డింగ్‌ని సెట్ చేయలేదని నాకు అనిపించింది. ఆడమ్ జంపా బౌలింగ్ చేస్తున్నప్పుడు స్టీవ్ స్మిత్ అటాకింగ్ ఫీల్డింగ్ సెట్ చేశాడు. అస్టన్ అగర్ బౌలింగ్ చేసినప్పుడు కూడా అద్భుతమైన ఫీల్డ్ సెట్‌తో ఫలితం రాబట్టాడు. దీనిపై మీరేమంటారు?' అని మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్‌ను ట్యాగ్ చేస్తూ సదరు అభిమాని ప్రశ్నించాడు.
దీనికి ఆయన.. 'టీమిండియా స్పిన్ విభాగానికి కోచ్‌గా ఉంటూ సలహాలు, సూచనలు అందిస్తానని నేను హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో చెప్పాను. ఆయన దానికి ఒప్పుకోలేదు. మీరు నా కంటే సీనియర్, నా కింద పనిచేయడం నాకు ఇష్టం లేదని ద్రవిడ్ నాతో అన్నారు' అని ఆ ప్రశ్నకు పొంతన లేని సమాధానమిచ్చాడు. అయితే ఫీల్డింగ్ సెట్ కంటే భారత స్పిన్నర్లు దారుణంగా విఫలమయ్యారనే విషయాన్ని ఇక్కడ శివరామకృష్ణన్ పరోక్షంగా తెలియజేశాడు. టీమిండియాకు స్పిన్ కోచ్ అవసరం ఉందని చెప్పకనే చెప్పాడు.