
చిట్టగాంగ్: అరంగేట్ర ఆటగాడు కైల్ మేయర్స్(310 బంతుల్లో 20 ఫోర్లు, 7 సిక్సర్లతో 210 నాటౌట్) అజేయ డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించడంతో బంగ్లాదేశ్‌తో జరిగిన ఫస్ట్ టెస్ట్‌లో వెస్టిండీస్ సంచలన విజయాన్నందుకుంది. కరోనా వైరస్ భయంతో అగ్రశ్రేణి ఆటగాళ్లు దూరమైన వేళ... ద్వితీయ శ్రేణి ఆటగాళ్లతో బరిలోకి దిగిన వెస్టిండీస్ అద్భుతం చేసింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం ముగిసిన ఫస్ట్ టెస్ట్‌లో విండీస్ 3 వికెట్ల తేడాతో గెలిచింది. బంగ్లాదేశ్ నిర్ధేశించిన 395 పరుగుల లక్ష్యాన్ని కైల్ మేయర్స్ సూపర్ ఇన్నింగ్స్‌తో హస్తగతం చేసుకొని ఔరా అనిపించింది.
ఓవర్‌నైట్ స్కోరు 110/3తో ఐదో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్ మరో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. టెస్టు క్రికెట్‌లో ఇది ఐదో అత్యధిక ఛేదన కాగా... ఆసియాలో అతిపెద్ద ఛేదనగా నిలిచింది. మ్యాచ్ గెలవాలంటే చివరిరోజు 285 పరుగులు చేయాల్సిన దశలో మరో అరంగేట్రం ఆటగాడు ఎన్‌రుమా బోనర్ (245 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో 86)తో కలిసి మేయర్స్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 216 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 1984 తర్వాత విండీస్ తరఫున నాలుగో ఇన్నింగ్స్‌లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం.
ఈ క్రమంలో 178 బంతుల్లో సెంచరీని, 303 బంతుల్లో ద్విశతకాన్ని అందుకున్న మేయర్స్.. 144 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో అరంగేట్రం మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్‌లో 'డబుల్' సెంచరీ బాదిన తొలి ప్లేయర్‌గా ఘనత వహించాడు. మేయర్స్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' పురస్కారం దక్కింది. రెండో టెస్టు 11 నుంచి జరుగుతుంది.