కొలంబో: టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కారణంగానే తనకు వికెట్లు దక్కాయని చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ తెలిపాడు. బౌలింగ్ కంటే బ్యాటింగ్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టానని చెప్పాడు. ఏదో ఒక రోజు తన బ్యాటింగ్‌తో జట్టుకు విజయాన్ని అందిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. ఆసియాకప్ 2023లో తన స్పిన్‌తో ప్రత్యర్థులను ఇబ్బంది పెడుతున్న కుల్దీప్ యాదవ్.. టీమిండియాకు ప్రధాన బౌలర్‌గా మారిపోయాడు.
పాకిస్థాన్‌తో ఐదు వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్.. శ్రీలంకతో నాలుగు వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. తన సూపర్ బౌలింగ్‌తో లోస్కోరింగ్ గేమ్‌లో టీమిండియాను గెలిపించాడు. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ సూచనలతో కొన్ని వికెట్లు పడగొట్టాడు. ఈ విజయానంతరం అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన కుల్దీప్ యాదవ్.. కేఎల్ రాహుల్‌కు క్రెడిట్ ఇచ్చాడు.

'నా వికెట్ల విషయంలో కేఎల్ రాహుల్ భాయ్‌కు క్రెడిట్ ఇవ్వాలనుకుంటున్నా. అతని ప్లానింగ్ అద్భుతం. గత రెండు మ్యాచ్‌ల్లో నేను తీసిన కొన్ని వికెట్లు అతని సలహాలతోనే వచ్చాయి. ముఖ్యంగా సమర విక్రమా స్టంపౌట్, పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో షాదాబ్ ఖాన్ వికెట్ రాహుల్ ప్లానింగ్‌తోనే పడగొట్టాడు.
మేం ఇద్దరం కలిసి ఉచ్చు బిగిస్తే ప్రత్యర్థి బ్యాటర్లు చిక్కుకోవాల్సిందే. ఈ క్రెడిట్ అంతా రాహుల్ భాయ్‌దే.
సదీర సమర విక్రమార్క స్టంపౌట్ అయితే రాహుల్ వల్లే అయ్యింది. నాలుగు, ఐదో స్టంప్ లైన్‌లో వేయాలని, బంతి డ్రిప్ అవుతుందని చెప్పాడు. అతను చెప్పినట్లు వేయగానే సదీర వికెట్ దొరికింది. ప్రస్తుతం నేను నా బౌలింగ్ కంటే బ్యాటింగ్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టాను. మెరుగ్గా బ్యాటింగ్ చేసేందుకు కష్టపడుతున్నాను. ప్రపంచకప్ టోర్నీలో అవకాశం వస్తే బ్యాట్‌తో సత్తా చాటేందుకు సిద్దమవుతున్నా. ఏదో ఒక రోజు నా బ్యాటింగ్‌తో జట్టుకు విజయాన్ని అందిస్తా'అని కుల్దీప్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
శ్రీలంకతో మ్యాచ్‌లో (4/43) నాలుగు వికెట్లతో సత్తా చాటిన కుల్దీప్ యాదవ్.. అంతర్జాతీయ వన్డేల్లో 150 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన భారత స్పిన్ బౌలర్‌గా చరిత్రకెక్కాడు. తద్వారా భారత మాజీ పేసర్, ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో మహమ్మద్ షమీ అగ్రస్థానంలో ఉన్నాడు. షమీ 80 మ్యాచ్‌ల్లోనే 150 వికెట్ల ఘనతను అందుకున్నాడు. కుల్దీప్ యాదవ్ 88 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్ సాధించగా.. అజిత్ అగార్కర్(97), జహీర్ ఖాన్(103), అనిల్ కుంబ్లే(106), ఇర్ఫాన్ పఠాన్(106) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.