సౌతాఫ్రికాతో గౌహతి వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ పిచ్ గురించి టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ పిచ్ చాలా భిన్నంగా ఉందని, ఫ్లాట్ రోడ్డు అని తెలిపాడు. అయితే ఈ పిచ్‌పై తమకు ఎలాంటి ఫిర్యాదులు లేవని, బౌలర్లకు అసలు సిసలు సవాల్ ఎదురువుతుందని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగుల భారీ స్కోర్ చేసింది.
సెనరన్ ముత్తుసామి(206 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 109) శతకంతో చెలరేగగా.. మార్కో జాన్సెన్(91 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 93) తృటిలో శతకం చేజార్చుకున్నాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్(4/115) నాలుగు వికెట్లు తీయగా.. జస్‌ప్రీత్ బుమ్రా(2/75), మహమ్మద్ సిరాజ్(2/106), రవీంద్ర జడేజా(2/94) రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసింది.

రెండో రోజు ఆట అనంతరం అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన కుల్దీప్ యాదవ్.. పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని చెప్పాడు. 'కోల్‌కతా పిచ్‌కు ఇది పూర్తిగా భిన్నంగా ఉంది. ఇది ఫ్లాట్ రోడ్డు లాంటి వికెట్. టెస్ట్ క్రికెట్‌లో ఈ తరహా పిచ్‌లతో బౌలర్లకు అతిపెద్ద సవాల్. ఒక బౌలర్‌గా.. ప్రతీ రోజు ఆధిపత్యం చెలాయించాలని అనుకుంటాం. కానీ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై.. వికెట్లు తీసేందుకు మార్గాలను కనుగొనాలి. నిన్న మేం గొప్ప నియంత్రణతో బౌలింగ్ చేశాం. కానీ ఒకే సెషన్‌లోని సుదీర్ఘ భాగస్వామ్యం మమ్మల్ని వెనక్కినెట్టింది.
ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రతీ బౌలర్ అద్భుతంగా రాణించారు. ఈ వికెట్‌పై బౌలర్లకు ఏ మాత్ర సహకారం లభించలేదు. పేసర్లకు కూడా అడ్వాంటేజ్ లేదు. కానీ ఈ పరిస్థితులను బౌలర్లు ఆస్వాదించాలి. ఇలాంటి కండిషన్స్‌లో ఎలా బౌలింగ్ చేయాలో నేర్చుకోవాలి. ఇలాంటి పరిస్థితులే బౌలర్లను మరింత పరిణతి చెందేలా చేస్తాయి. పిచ్ గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. కేవలం పరిస్థితులకు అనుగుణంగానే బౌలింగ్ చేయాలి. తదుపరి టెస్ట్‌కు బౌలర్లకు మెరుగైన పిచ్ లభిస్తుందని నేను ఆశిస్తున్నాను. ఈ వికెట్‌పై మాకు ఎలాంటి ఫిర్యాదులు లేవు.
ప్రస్తుతం డ్రెస్సింగ్ రూమ్‌లో మంచి వాతావరణం బాగానే ఉంది. మేం బాగా బ్యాటింగ్ చేయాలి. మూడో రోజు తొలి 5-6 ఓవర్లు చాలా కీలకం. ప్రతి సెషన్ మాకు ముఖ్యమైనదే. సెషన్ సెషన్ ఆడుతూ ముందుకు సాగాలి. నాలుగో, ఐదో రోజు ఆట గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. మేం ఐదు సెషన్ల పాటు బ్యాటింగ్ చేస్తే.. మంచి స్థితిలో ఉంటాం.'అని కుల్దీప్ యాదవ్ చెప్పుకొచ్చాడు.