
అబుదాబి: తమ జట్టులో 140 కిమీ వేగంతో బంతులేసే ముగ్గురు పేసర్లు ఉండటం అదృష్టమని ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా అన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 5 వికెట్లతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో రోహిత్ సేన టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన కృనాల్.. తమ బౌలర్లు సమష్టిగా రాణించడం వల్లే మ్యాచ్ గెలిచామన్నాడు. ఆదిలోనే పృథ్వీషా వికెట్ తీయడంతో తమకు శుభారంభం దక్కిందని, టీ20ల్లో ఏ జట్టుకైనా పవర్‌ప్లేలో వికెట్ దక్కితే ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి నెలకొంటుందని తెలిపాడు.
'డెత్ ఓవర్లలో ఫాస్ట్ బౌలర్లు ప్రత్యేకం. ఆ సమయంలో ముంబై ఎక్కువ పరుగులు ఇవ్వలేదు. మధ్యలో రాహుల్ చాహర్ సైతం అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మా జట్టులో 140 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బంతులేసే ముగ్గురు పేసర్లు ఉండటం అదృష్టం. ఈ మ్యాచ్‌లో నా ప్రదర్శన కూడా సంతృప్తినిచ్చింది.
నేను బాగా బౌలింగ్ చేయడం సంతోషంగా ఉంది. పరిస్థితులకు తగ్గట్లు వైవిధ్యమైన బంతులు వేసాను. అయితే 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం కొంత అయోమయానికి గురి చేస్తుంది. అదే 180 పరుగులు సాధించాల్సి ఉంటే కచ్చితంగా వేగంగా ఆడాల్సిన అవసరం ఉందని ముందే తెలుస్తుంది. ఒకవేళ 140 స్కోర్ ఛేదించాల్సి ఉంటే అప్పుడు నిలకడగా ఆడినా ఫర్వాలేదనే భరోసా ఉంటుంది. కానీ, 160 పరుగుల లక్ష్యం ఉంటే మాత్రం ఎలా ఆడాలో అర్ధంకాదు'అని కృనాల్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 162 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (52 బంతుల్లో 69 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (33 బంతుల్లో 42; 5 ఫోర్లు) రాణించారు. తర్వాత ముంబై ఇండియన్స్ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 166 పరుగులు చేసి గెలిచింది. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' డికాక్ (36 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), సూర్యకుమార్ (32 బంతుల్లో 53; 6 ఫోర్లు, 1 సిక్స్) మెరిపించారు.