
న్యూఢిల్లీ: భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఎంఎస్ ధోనీ ఒకడిగా ఉంటాడు. అయితే ఈ ప్రయాణంలో అతడి వ్యూహాలతో పాటు చాలామంది మార్గదర్శకులు ప్రేరణగా నిలిచారని భారత మాజీ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ పేర్కొన్నాడు. ముఖ్యంగా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే నుంచి నాయకుడిగా ఎలా ఉండాలో ధోనీ నేర్చుకున్నాడని తెలిపాడు.
ఆదివారం ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ మాట్లాడుతూ.. '2007 టీ20 ప్రపంచకప్ సమయంలో అనుభవం లేని ఆటగాళ్లతోనే జట్టును విజేతగా నిలపడంతో ధోనీ ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. గంగూలీ దూకుడుకు పూర్తి భిన్నంగా ప్రశాంతంగా ఉంటూనే ఆటగాళ్లను ఉత్తేజపరిచాడు. అయితే పరిమిత ఓవర్లలో అతను కెప్టెన్‌గా ఉన్నా టెస్టుల్లో కుంబ్లే నాయకత్వంలో ఆడాడు. ఈ సమయంలో అతడు మరిన్ని విషయాలు నేర్చుకోగలిగాడు. ధోనీకి తగినంత అనుభవం లభించేందుకు కుంబ్లే కారణమయ్యాడు' అని శ్రీకాంత్ వివరించాడు.
ఇక అంతకుముందు ఓ ఇంటర్వ్యూలో ధోనీకి తాను వీరాభిమానినని, ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ జట్టులో మహీ ఉండాలని అభిప్రాయపడ్డాడు. భారత క్రికెట్‌కు ధోనీ ఎంతో చేశాడని, అయితే, ఈ ఏడాది ఐపీఎల్ జరుగకుంటే నేరుగా ధోనీని ప్రపంచకప్‌నకు సెలెక్టర్లు ఎంపిక చేయడం కష్టమేనని శ్రీకాంత్ అన్నాడు.
'నేను ఎంఎస్ ధోనీ వీరాభిమానిని. కానీ.. ఇక్కడ నేను ప్రపంచకప్, అందులో ఆడే జట్టు గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. జట్టే ముఖ్యం, ఆ తర్వాతే వ్యక్తిగతం. నిజానికి ధోనీని ప్రపంచకప్ జట్టుతో పాటు తీసుకెళ్లడం నాకు ఇష్టం లేదు. ఇక ఐపీఎల్ జరగకపోతే.. మహీ టీ20 ప్రపంచకప్ కోసం తిరిగి జట్టులోకి రావడం చాలా కష్టం. మహీ చాలా ఫిట్, ఒక లెజెండ్, తెలివైనవాడు అని కృష్ణమాచారి శ్రీకాంత్ పేర్కొన్నాడు.